NTV Telugu Site icon

T20 World Cup 2024: టీమిండియాకు గాయల బెడద.. నలుగురు స్టార్ ప్లేయర్స్..!

India Women's Squad

India Women's Squad

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024 అక్టోబరు 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. భారత్‌ అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 6న జరగనుంది. ఇక 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. భార‌త మ‌హిళ‌ల‌ జ‌ట్టు ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని ఏన్సీఏలో ప్రాక్టీస్ చేస్తోంది. టైటిల్ లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. అయితే భార‌త జ‌ట్టును గాయాల బెడ‌ద వెంటాడుతోంది.

స్టార్ పేస‌ర్ అరుంధతి రెడ్డి ప్ర‌స్తుతం భుజం గాయంతో బాధపడుతోంది. ప్ర‌స్తుతం ఆమె ప్రాక్టీస్ చేయడం లేదు. అయితే ప్రపంచకప్ ఆరంభానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ అరుంధతి ఈ మెగా టోర్నీకి దూరం అయితే భార‌త్‌కు గ‌ట్టి ఎదురు దెబ్బే అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అరుంధ‌తి ప్ర‌స్తుతం అద్బుత‌మైన ఫామ్‌లో ఉంది. స్టార్ ఆల్‌రౌండ‌ర్ పూజా వస్త్రాకర్ కూడా భుజం గాయంతో సతమతమవుతోంది. అయితే పూజా మాత్రం త‌న ప్రాక్టీస్‌ను కొన‌సాగిస్తోంది. టోర్నీ ఆరంభ స‌మ‌యానికి ఆమె పూర్తి ఫిట్‌నెస్ సాధించే ఛాన్స్ ఉంది.

వేలి గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమైన యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఇంకా కోలుకోలేదు. టీ20 ప్రపంచకప్‌ 2024కు ఎంపికైన‌ప్ప‌ట‌కీ.. టోర్నీకి అందుబాటులో ఉంటుందా? లేదా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. శ్రేయాంక మెగా ఈవెంట్ ఆడుతుందని మెనెజ్‌మెంట్ ఆశిస్తోంది. స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ కూడా చేతి వేలి గాయంతో బాధపడుతోంది. అయితే జెమిమా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. ప్రపంచకప్‌ సమయానికి కోలుకునే సూచనలు కన్పిస్తున్నాయి. స్టార్ ప్లేయ‌ర్లు గాయాల‌తో బాధ‌ప‌డుతుండ‌డంతో టీమ్ మెనెజ్‌మెంట్ ఆందోళ‌న చెందుతోంది.