NTV Telugu Site icon

Viral Video: మాజీ సీఎం సిద్ధరామయ్యకు చేదు అనుభవం.. డబ్బులు విసిరికొట్టిన మహిళ

Siddaramaiah

Siddaramaiah

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. కెరూర్ అల్లర్లలో గాయపడిన వారికి సిద్ధరామయ్య సాయం చేస్తుండగా ఒక మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.2లక్షల నష్టపరిహారాన్ని ఆయనపై విసిరి పడేసింది. మీరిచ్చే డబ్బులు అవసరం లేదంటూ విసిరికొట్టింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది.

బాగల్‌కోట్ జిల్లాలోని కెరూర్‌లో ఈ నెల 6న హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. యాసిన్‌ అనే వ్యక్తి.. ఓ వర్గానికి చెందిన యువతిని వేధిస్తున్నాడన్న విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో హిందూ జాగరణ వేదిక కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో, యాసిన్‌ తన అనుచరులతో కలిసి వారిపై దాడి చేశాడు. దీంతో హింస చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు యువకులు గాయపడ్డారు. పోలీసులు రెండు వర్గాలకు సంబంధించిన 20 మందిని అరెస్ట్ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు సిద్ధరామయ్య శుక్రవారం ఆస్పత్రికి వెళ్లారు. బాధిత నాలుగు కుటుంబాలకు రూ.50 వేల చొప్పున 2లక్షలు అందించి బయటకు వచ్చారు.

Skill Makthal: టీహబ్ వేదికగా ‘స్కిల్ మఖ్తల్’ లోగో ఆవిష్కరణ

అక్కడ గాయపడ్డ వ్యక్తి కుటుంబానికి సంబంధించిన ఓ మహిళ ఆయన కారు ఎక్కుతుండగా ఆ డబ్బులను ఎస్కార్ట్ వాహనంపైకి విసిరేసింది. ‘మాకు డబ్బు అవసరం లేదు.. న్యాయం కావాలి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి హింసకు పాల్పడే దుండగులను శిక్షించాలి.. సమాజంలో శాంతి నెలకొనాలి’ అంటూ సిద్ధరామయ్య వాహనంపై డబ్బులు విసిరేసిన మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందువులైనా, ముస్లింలైనా అందర్ని సమానంగా చూడాలంటూ వాపోయింది. రాజకీయ నాయకుల ఓదార్పు అవసరం లేదని , ప్రశాంతంగా ఉండనివ్వాలని ఆ మహిళ నినాదాలు చేసింది. ఏ తప్పు చేయకపోయినా.. కారణం లేకుండా తమ వారిపై దాడి చేశారని బోరుమంది. గాయపడ్డ వారు ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాలని.. డబ్బు తమ సమస్యకు పరిష్కారం కాదని పేర్కొంది. భిక్షాటన చేసి అయినా తన కుటుంబాన్ని పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.