NTV Telugu Site icon

AP Crime: ఈపురుపాలెంలో మహిళ హత్య.. బాధిత కుటుంబాన్ని కలవాలని హోంమంత్రికి సీఎం ఆదేశం

Chandrababu

Chandrababu

AP Crime: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో సుచరిత అనే మహిళ హత్యకు గురైంది. సుచరిత హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. వెంటనే ఘటన ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవాలని, ప్రభుత్వం తరపున మృతురాలి కుటుంబానికి అండగా ఉండాలని హోంమంత్రికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి వేగవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు సీఎం చంద్రబాబు. దర్యాప్తులో అలసత్వం లేకుండా.. జాప్యం జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో హత్య జరిగిన ఈపురుపాలెంకు హోంమంత్రి అనిత బయలుదేరారు. ఇదిలా ఉండగా.. సీఎం చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమల రావు భేటీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సీఎం చంద్రబాబును డీజీపీ ద్వారకా తిరుమల రావు కలిశారు. చీరాల మండలం ఈపూరు పాలెంలో మహిళ హత్యోందతాన్ని సీరియస్‌గా తీసుకోవాలని డీజీపీకి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

Read Also: AP Assembly Speaker: శాసనసభ స్పీకర్‌ ఎన్నిక.. అయ్యన్నపాత్రుడు తరపున పవన్‌, లోకేష్‌ నామినేషన్‌

అసలేం జరిగిందంటే..
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన సుచరిత(21) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కూతురు ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో వెతుకుతూ వెళ్లిన తల్లికి స్థానిక గర్ల్స్ హైస్కూల్ సమీపంలో కుమార్తె సుచరిత మృతదేహం కనిపించింది. ఈ క్రమంలో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. .సుచరిత మృతిని అత్యాచారం, అనంతరం హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఘటన వివరాలను ఎస్పీ వకుల్ జిందాల్ యువతి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.