NTV Telugu Site icon

Mallikarjun Kharge: ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య.. రాహుల్‌ కోసం పోరాడుతాం..

Mallikarjun Kharge

Mallikarjun Kharge

Mallikarjun Kharge: లోక్‌సభ ఎంపీగా రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని, రాహుల్‌ కోసం పోరాటం చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రకటించారు. రాహుల్‌పై వేటు నియంతృత్వ చర్య అని, బీజేపీ కుట్రలను తిప్పికొడతామని.. నిజాలు మాట్లాడితే ఎన్డీయే సర్కారు ఓర్చుకోవడం లేదని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. రాహుల్ గాంధీ ఓబీసీ వర్గాలను దొంగలతో పోల్చారని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా చేసిన ఆరోపణను కాంగ్రెస్ శుక్రవారం తోసిపుచ్చింది. పాలకపక్షం పారిపోయిన నీరవ్ మోదీ, లలిత్ మోదీ వంటి వారిని సమర్థిస్తోందని, కుల రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించింది.

దొంగతనంలో మొదట సహాయం అందించి ఆపై కుల రాజకీయాలను ప్రయోగిస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. ఇది సిగ్గుచేటన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల సొమ్ముతో ఎవరు పారిపోయారనే దానిపై తమ పార్టీ సమాధానాలు వెతుకుతోందని, అయితే బీజేపీ ప్రధాన సమస్య నుంచి దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు. వారు వెనుకబడిన తరగతులను అవమానించేలా మాట్లాడుతున్నారు. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, మైనారిటీల కోసం కాంగ్రెస్ ఎల్లప్పుడూ నిలబడి పోరాడుతోంది. మనువును నమ్మే ఈ ప్రజలు వెనుకబడిన తరగతుల గురించి మాట్లాడుతున్నారని ఖర్గే అన్నారు.

Read Also: Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు

మరోవైపు ఈ పరిణామంపై మరో సీనియర్‌, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ స్పందించారు. ఈ చర్యపై మౌనంగా ఉండబోమని, న్యాయపోరాటం చేస్తామన్నారు. రాజకీయంగా ఎదుర్కొంటాం. మేము మౌనంగా ఊరుకునేది లేదు. అదాని హిండెన్‌బర్గ్‌ వ్యవహారంపై జేపీసీ వేయాలని కోరితే.. రాహుల్ గాంధీని అనర్హత వేటు వేశారని మండిపడ్డారు. వాస్తవాలను వక్రీకరిస్తున్నాడని, పరువు నష్టం రాజకీయాలు చేస్తున్నాడని జేపీ నడ్డాపై జైరాం రమేష్‌ విరుచుకుపడ్డారు. క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన గుజరాత్ కోర్టుపై ప్రశ్నలు లేవనెత్తినందుకు కాంగ్రెస్‌పై దాడి చేసిన కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌పై కూడా ఆయన మండిపడ్డారు.

Read Also: Delhi excise policy case: సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

కేరళ వయనాడ్‌ ఎంపీగా ఉన్న రాహుల్‌ గాంధీకి.. 2019 నాటి పరువు నష్టం దావా కేసులో నిన్న గుజరాత్‌ సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో.. ప్రజాప్రాతినిధ్య చ‌ట్టం, 1951 లోని సెక్షన్‌ సెక్షన్‌ 8(3), రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 102(1)(e) ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పాల్‌ కుమార్‌ సింగ్‌ పేరిట నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. అప్పీలేట్ కోర్టు శిక్షను సస్పెండ్ చేయడంతో పాటు రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేస్తే, రాహుల్ గాంధీ గాంధీ వెంటనే పార్లమెంటు సభ్యునిగా అనర్హత నుంచి తప్పించుకోవచ్చు.