NTV Telugu Site icon

Liver Donation: అర్థాంగి అనే మాటకు అర్థం చెప్పిన మహిళ.. తన భర్త ప్రాణాలకు తన ప్రాణం అడ్డేసి..!

Lavanya Liver Donation

Lavanya Liver Donation

Liver Donation: భార్య జీవితానికి సహచరురాలే కాదు, గమ్యానికి ప్రేరణ కూడా. ఆమె ప్రేమ, అనురాగం, బంధం భర్త జీవితాన్ని మరింత విలువైనదిగా మారుస్తాయి. భార్య అంటే కేవలం ఒక పాత్ర కాదు.. ఆమె భర్త ఆనందానికి మూలం, భర్త బాధలను తగ్గించే ఓదార్పు, ప్రతి విజయానికి వెనుక ఉన్న అండగా నిలిచే వ్యక్తి. ఆమె తోడు ఒక కుటుంబాన్ని మాత్రమే కాకుండా, ఒక సంతోషకరమైన ప్రపంచాన్ని నిర్మిస్తుంది. భార్య తన చిన్న చిన్న చర్యలతో కూడా జీవితాన్ని సున్నితంగా, సుందరంగా తీర్చిదిద్దుతుంది. ఆమె ఒక స్నేహితురాలు, మార్గదర్శి, కష్టకాలంలో ధైర్యం ఇచ్చే తోడుగా ఉంటుంది. ఆమె చూపే ప్రేమ, చూపించే నమ్మకం, అందించే మద్దతు మన జీవితానికి నడిచే దారి చూపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే, భార్య అంటే జీవితపు గుండె చప్పుడు, కుటుంబానికి ప్రాణమని చెప్పచ్చు.

Galla Ashok: దేవకీ నందన వాసుదేవ’ డివైన్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు అదిరిపోతాయి!

అలాంటి ఓ భార్య తన భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి తీసుకున్న నిర్ణయం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఖమ్మం జిల్లాలో మానవత్వం, ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఘటన ఇది. రఘునాథపాలెం మండలం పెద్ద ఈర్లపూడికి చెందిన ధరావత్ శ్రీనివాస్, ఖమ్మం ఏపీజీవీబీ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి. ఆయన భార్య లావణ్య ఎల్ఎల్బీ చివరి సంవత్సరం చదువుతుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

శ్రీనివాస్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. పరీక్షల కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించగా, కామెర్లతో పాటు కాలేయ సమస్య ఉందని వైద్యులు గుర్తించారు. దీంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్‌లోని వివిధ ఆసుపత్రుల్లో లక్షల రూపాయల ఖర్చుతో మెరుగైన చికిత్సలు చేయించినా ఫలితం కనిపించలేదు. పలు పరీక్షల అనంతరం వైద్యులు కాలేయ మార్పిడి చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.

కాలేయ దాత కోసం అనేక ప్రయత్నాలు చేసినా ఎక్కడా దాత దొరకలేదు. ఈ క్రమంలో, తన భర్తను ఎలా అయినా రక్షించుకోవాలని పట్టుదలతో లావణ్య తన కాలేయాన్ని దానం చేయాలని నిర్ణయించింది. వైద్యుల సిఫారసుల మేరకు లావణ్యకు అన్ని పరీక్షలు నిర్వహించగా, ఆమె కాలేయం శ్రీనివాస్‌కు సరిపోతుందని నిర్ధారించారు. సికింద్రాబాద్‌ కిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు లావణ్య కాలేయం నుంచి 65 శాతం తీసి విజయవంతంగా శ్రీనివాస్‌కు అమర్చారు. ప్రస్తుతం శ్రీనివాస్, లావణ్య ఇద్దరూ ఆరోగ్యంగా కోలుకుంటున్నారు. ఈ అరుదైన సంఘటనలో లావణ్య తన భర్తకు పునర్జన్మ ప్రసాదించి, అర్ధాంగి అనే పదానికి నిజమైన అర్థాన్ని తెలిపింది. ఆమె ధైర్యం, త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకంగా మారింది. లావణ్యను నానా విధాలుగా అభినందనలు కురిపిస్తున్నారు.

Pushpa 2: కిస్సిక్ కస్సక్ అనిపించేది ఆరోజే!!