Tilak Varma Dedicates His Maiden Fifty To Rohit Sharma Daughter Samaira: హైదరాబాద్ యువ ఆటగాడు తిలక్ వర్మ వెస్టిండీస్ టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అరంగేట్రం చేయడమే కాదు.. అదరగొట్టేస్తున్నాడు కూడా. తొలి టీ20లో 39 పరుగులు చేసిన తిలక్.. రెండో టీ20లో హాఫ్ సెంచరీ (51) చేశాడు. తిలక్‌కు కెరీర్‌లో ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఈ ప్రత్యేకమైన హాఫ్ సెంచరీని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుమార్తె సమైరాకి అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. అందుకు కారణం ఏంటో కూడా తిలక్ వర్మ వెల్లడించాడు.
రెండో టీ20 మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ మాట్లాడుతూ… ‘రోహిత్ శర్మ, రితికా సజ్దే దంపతుల కుమార్తె సమైరాకి నా అంతర్జాతీయ తొలి హాఫ్ సెంచరీని అంకితం ఇస్తున్నా. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుతో ఆడుతున్న సమయంలో సమైరాతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. అంతర్జాతీయ కెరీర్‌లో నేను చేసే తొలి సెంచరీ లేదా హాఫ్ సెంచరీని నీకు అంకితం ఇస్తా అని సమైరాకి ఎప్పుడో ప్రామిస్ చేశా. ఈ హాఫ్ సెంచరీ ఆమెకే అంకితం. ఇక సమైరాతో సంబరాలు చేసుకుంటా’ అని అన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరఫున గత రెండు సీజన్లలో అదరగొట్టిన హైదరాబాద్ యువ క్రికెటర్ తిలక్ వర్మ భారత జట్టుకు ఎంపికయ్యాడు. తొలి టీ20లో భారత టాప్ బ్యాటర్లు చేతులెత్తేసినా.. తిలక్ మాత్రం నికార్సయిన షాట్లతో అలరించాడు. గ్యాప్‌లలో పరుగులు రాబడుతూ 22 బంతుల్లో 39 పరుగులు చేశాడు. భారత్ స్వల్ప తేడాతో ఓడినా.. తిలక్ మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. రెండో టీ20లో ఏకంగా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
రెండో టీ20లో హాఫ్ సెంచరీ చేసిన తిలక్ వర్మ ఓ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ వయస్సులో హాఫ్ సెంచరీ బాదిన రెండో భారత ఆటగాడిగా తిలక్ రికార్డుల్లో నిలిచాడు. ఈ ఘనతను 20 ఏళ్ల 271 రోజుల వయస్సులో అతడు అందుకున్నాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్ (21 ఏళ్ల 38 రోజులు) రికార్డు బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (20 ఏళ్ల 143 రోజులు) అగ్ర స్థానంలో ఉన్నాడు.
A special fifty 👍
A special celebration for someone special from the Rohit Sharma family ☺️#TeamIndia | #WIvIND | @ImRo45 | @TilakV9 pic.twitter.com/G7knVbziNI
— BCCI (@BCCI) August 6, 2023