Economic Survey: డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ గురువారం ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి చేరింది. ఒక డాలర్‌కు రూపాయి విలువ 92కు పడిపోవడం ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి విలువ దాదాపు 2.5 శాతం తగ్గింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెపో రేటు కోతలను నిలిపివేయడం ఈ పతనానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఆర్థిక సర్వే–2026ను ప్రవేశపెట్టారు. ఈ సర్వేలో భారత రూపాయి బలహీనతపై కీలక విశ్లేషణను పొందుపరిచారు. రూపాయి ఎందుకు క్షీణిస్తోంది, దాని వల్ల కలిగే ప్రభావాలు ఏమిటి, దీనిని ఎలా నియంత్రించవచ్చనే అంశాలపై స్పష్టతనిచ్చింది.
రూపాయి ఎందుకు పడిపోతోంది..?
ఆర్థిక సర్వే ప్రకారం, భారత రూపాయి నిరంతర పతనం దేశ ఆర్థిక మౌలికాంశాలను పూర్తిగా ప్రతిబింబించడం లేదు. రూపాయి తన వాస్తవ సామర్థ్యానికి మించి బలహీనపడుతోందని నివేదిక పేర్కొంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన బృందం రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, అమెరికా విధించిన సుంకాల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించడంలో రూపాయి క్షీణత సహకరిస్తోంది. మరోవైపు, అమెరికా సుంకాల పెరుగుదలే రూపాయి పతనానికి ప్రధాన కారణం కాదని సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి విలువ తగ్గడం పూర్తిగా హానికరం కాదని, ఇది భారత ఎగుమతులకు కొంత లాభాన్ని చేకూరుస్తుందని పేర్కొంది.
పెట్టుబడిదారుల ఆందోళన
అయితే, రూపాయి బలహీనత విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచుతోందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడంపై వారు వెనుకంజ వేయడానికి గల కారణాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. దేశంలోకి మూలధన ప్రవాహం తగ్గడం, పెట్టుబడుల ఉపసంహరణలు పెరగడం వల్లే రూపాయి బలహీనత ఏర్పడిందని నివేదిక పేర్కొంది.
రూపాయి పతనాన్ని ఎలా కట్టడి చేయాలి..?
రూపాయి పతనాన్ని ఎదుర్కోవడానికి పలు చర్యలు తీసుకోవాలని ఆర్థిక సర్వే సూచించింది. పెరుగుతున్న దిగుమతి బిల్లును సమర్థంగా నిర్వహించాలంటే, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించే విధానాలు అవసరమని పేర్కొంది. అలాగే, విదేశీ కరెన్సీలో ఎగుమతి ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించింది. గత ఏడాది కాలంలో రూపాయి విలువ 6 శాతం కంటే ఎక్కువగా పడిపోయింది. దీని కారణంగా దిగుమతులు ఖరీదైనవిగా మారగా, ఎగుమతులు చౌకగా మారి భారత ఆర్థిక వ్యవస్థకు కొంత పోటీ సామర్థ్యం పెరిగింది. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడంతో పాటు, ఎగుమతులపై మరింత దృష్టి పెట్టాలని ఆర్థిక సర్వే పిలుపునిచ్చింది.