NTV Telugu Site icon

China Zero Covid Policy: చైనా జీరో-కొవిడ్ పాలసీని ఎత్తేస్తే.. 20 లక్షల మంది చనిపోతారట!

China Zero Covid Policy

China Zero Covid Policy

China Zero Covid Policy: చైనా జీరో కొవిడ్‌ విధానంపై ఆ దేశ పౌరుల నుంచి నిరసన వ్యక్తం అవుతుండడంతో ఆంక్షలు సడలించాలని డ్రాగన్ సర్కారు చూస్తోంది. ఆ దేశం జీరో కొవిడ్ విధానాన్ని సులభతరం చేయడానికి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. జీరో-కొవిడ్ పాలసీని ఎత్తేస్తే లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని పరిశోధకులు చెబుతున్నారు. పూర్తి స్థాయి ఆంక్షలు ఎత్తివేస్తే ఎదురయ్యే పరిణామాల పట్ల చైనాలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజల్లో హెర్డ్‌ ఇమ్యూనిటీ, వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉండడం వంటివి అందుకు కారణాలని చెబుతున్నారు. శుక్రవారం నాటికి చైనాలో 5,233 కొవిడ్‌ సంబంధిత మరణాలు సంభవించగా.. 3.31 లక్షల మందిలో కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి.

హాంకాంగ్ మాదిరిగా కొవిడ్‌ నియంత్రణలను సడలిస్తే చైనా 2 మిలియన్లకు పైగా మరణాలను ఎదుర్కొంటుందని నైరుతి గ్వాంగ్జీ ప్రాంతంలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ హెడ్ జౌ జియాటాంగ్ గత నెలలో షాంఘై జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రచురించిన పేపర్‌లో చెప్పారు. అలాగే కొవిడ్‌ కేసులు 23 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. చైనా, అమెరికా చెందిన పరిశోధకులు మేలో ఓ అంచనా వేశారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయకుండా, ఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగుపర్చకుండా జీరో కొవిడ్‌ పాలసీ నుంచి చైనా పూర్తిగా వైదొలిగితే దాదాపు 15 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. నేచర్‌ మెడిసిన్‌లో ప్రచురించబడిన పరిశోధనలో వారు వెల్లడించారు. టీకాపై దృష్టి సారిస్తే మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని చైనాలోని ఫుడాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు, ప్రధాన రచయితలు తెలిపారు. కొవిడ్‌ దశ పీక్‌కు చేరినప్పుడు ఇన్సింటివ్‌ కేర్‌లకు 15 రెట్ల డిమాండ్‌ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు.

Bharat Jodo Yatra:భారత్‌ జోడో యాత్రలో కంప్యూటర్‌ బాబా.. పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ దూరం!

వ్యాక్సినేషన్, బూస్టర్‌ రేట్‌ తక్కువగా ఉండడం, హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ లేకపోవడం వంటి కారణాల వల్ల చైనా తన జీరో-కోవిడ్ విధానాన్ని ఎత్తివేస్తే 13 లక్షల నుంచి 21 లక్షల మంది చనిపోతారని బ్రిటిష్‌ సైంటిఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ అనలటిక్స్‌ కంపెనీ ఎయిర్‌ఫినిటీ సోమవారం తెలిపింది. హాంకాంగ్‌లో ఫిబ్రవరిలో సంభవించిన బీఏ.1 వేవ్‌ను పరిగణనలోకి తీసుకుని అంచనా కట్టినట్లు వెల్లడించింది.