NTV Telugu Site icon

Pakistan Cricket: ఘన ప్రస్థానం నుంచి పతనం వైపు.. పాకిస్తాన్ క్రికెట్‌కు ఏమైంది?

Pakistan Cricket

Pakistan Cricket

ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌లో పాకిస్తాన్ టీమ్ హవా నడించింది. సొంతగడ్డపైనే కాక.. విదేశాల్లోనూ ఆధిపత్యం చెలాయించింది. 1992లో వన్డే ప్రపంచకప్‌, 2009లో టీ20 ప్రపంచకప్‌లను గెలిచింది. అలాంటి టీమ్ ప్రస్తుతం అనూహ్య ఓటములను ఎదుర్కొంటోంది. పసికూనల చేతుల్లో కూడా ఓడిపోతోంది. ఘన ప్రస్థానం నుంచి.. పాకిస్తాన్ పతనం వైపు వేగంగా అడుగులేస్తోందా? అంటే.. అవుననే సమాధానం వస్తోంది.

గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌ ఆట తీరు రోజురోజుకు పడిపోతోంది. టీ20ల్లో ఐర్లాండ్‌ చేతిలో ఓడిన పాక్.. టీ20 ప్రపంచకప్‌ 2024లో పసికూన అమెరికా చేతిలో పరాజయం పాలైంది. సొంతగడ్డపై 0-2తో టెస్టు సిరీస్‌ను బంగ్లాదేశ్‌కు కోల్పోయింది. తాజాగా ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 550కి పైగా పరుగులు చేసినా.. ఇన్నింగ్స్‌ తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక ఇటీవలి కాలంలో టీమిండియాపై గెలిచిన దాఖలు లేవు. 2022 నుంచి స్వదేశంలో ఆడిన 11 టెస్టుల్లో ఒక్క మ్యాచ్ గెలవలేదు. 2023 వన్డే ప్రపంచకప్‌, 2024 టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌ దశ నుంచే నిష్క్రమించింది. ఇక టెస్టు ర్యాంకింగ్స్‌లో అయితే 8వ స్థానానికి పడిపోయింది.

పాకిస్థాన్‌ క్రికెట్ పతనానికి ఎన్నో కారణాలు ఉన్నాయనే చెప్పాలి. గత రెండేళ్లలో పీసీబీకి ముగ్గురు ఛైర్మన్‌లు.. జట్టుకు ముగ్గురు కెప్టెన్‌లు, ఏడుగురు కోచ్‌లు మారారు. ముఖ్యంగా పీసీబీలో రాజకీయ జోక్యం చేటు చేస్తోంది. పీసీబీకి ఛైర్మన్‌ మారిన ప్రతిసారి సెలక్షన్‌ కమిటీలో, జట్టు నాయకత్వంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దాంతో ప్లేయర్స్ మధ్య సమన్వయ లోపం ఏర్పడుతోంది. అంతేకాదు ప్లేయర్స్ గ్రూప్‌లుగా విడిపోతున్నాయి. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న మోసిన్‌ నఖ్వి.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఓటమి అనంతరం కొత్త సెలక్షన్‌ కమిటీని తీసుకున్నాడు. ఆ కమిటీ బాబర్‌ అజామ్, షహీన్‌ షా అఫ్రిదిని పక్కనపెట్టింది. అది వివాదస్పదంగా మారడంతో విశ్రాంతి ఇచ్చామని కవర్ చేశారు.

Also Read: T20 World Cup 2024: భారత్ సెమీస్‌ చేరుతుందనుకుంటే.. సీన్ రివర్స్ అయిందిగా!

పాకిస్థాన్‌లో ప్రతిభకు లోటు లేదు కానీ.. దానిని గుర్తించి సానబెట్టే మేనేజ్మెంట్ లేదు. స్టార్ ఆటగాళ్లు ఫామ్‌తో తంటాలు పడుతుంటే.. వారికి మద్దతునిచ్చే వారు కరువయ్యారు. ఇందుకు బాబర్‌ అజామ్‌ ఉదంతమే మంచి ఉదాహరణ. ప్రపంచ క్రికెట్‌లో గొప్ప బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న బాబర్‌.. ఏడాదిగా పెద్దగా రాణించలేదు. కొన్నేళ్ల పాటు జట్టు వైఫల్యం కెప్టెన్‌గా అతడిపై తీవ్ర ప్రభావమే చూపించింది. కెప్టెన్సీఒత్తిడి అతడి బ్యాటింగ్‌ దెబ్బ తినేలా చేసింది. గత 18 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు. వన్డేలు, టీ20ల్లోనూ పెద్దగా రాణించలేదు. ఫామ్‌ కోల్పోయిన బాబర్‌ను పట్టించుకునే స్థితిలో పాక్ మేనేజ్మెంట్ లేదు. మరోవైపు ప్రపంచ అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న షహీన్‌ అఫ్రిది ఫామ్ గొప్పగా లేదు. 2023 నుంచి 11 ఇన్నింగ్స్‌లో 17 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. బోర్డులో రాజకీయాలు అంశాలు మైదానంలో ప్లేయర్స్ ఆటపై ప్రభావం చూపిస్తున్నాయి.