గత నెలలో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ని పెంచింది. ఆ తర్వాత.. దీపావళికి ముందు డీఏ పెంచే ప్రకటనలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జరిగాయి. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్, అస్సాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, చండీగఢ్‌లలో డీఏను పెంచి పండుగకు ముందు ఉద్యోగులకు సంతోషాన్ని ఇచ్చారు. అయితే డీఏల పెంపుపై ఏ రాష్ట్రం ఏ నిర్ణయం తీసుకుందో తెలుసుకుందాం.
Skin Diseases: వాయు కాలుష్యంతోనే చర్మ వ్యాధులు.. డేంజర్ అంటున్న నిపుణులు..!
కేంద్ర ప్రభుత్వం 4 శాతం పెంచింది
అక్టోబర్ 18న ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ భేటీలో 4 శాతం డీఏ పెంపుదల ప్రకటించారు. ఈ నిర్ణయం 2023 జూలై 1 నుండి అమలులోకి వస్తుంది. దీంతో జీతం, పెన్షన్‌లో ప్రస్తుత డీఏ రేటు 46 శాతానికి పెరిగింది.
అస్సాంలో 5 లక్షల మంది ఉద్యోగులకు
కేంద్రంలాగే అస్సాంలోని హిమంత బిస్వా శర్మ ప్రభుత్వం కూడా కరువు భత్యాన్ని 4 శాతం పెంచింది. అస్సాంలో దాదాపు 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరితో పాటు రిటైర్డ్ ఉద్యోగులు కూడా లబ్ధి పొందనున్నారు. అస్సాంలో మొత్తం డీఏ ఇప్పుడు 46 శాతానికి చేరుకుంది. దీపావళి కానుకగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని కేబినెట్ ఆమోదించిందని ముఖ్యమంత్రి ఎక్స్ లో పోస్ట్ చేశారు.
డీఏ పెంచిన యోగి ప్రభుత్వం
ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ)ని 4 శాతం నుండి 46 శాతానికి పెంచింది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.2100 కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. అంతేకాకుండా.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఎక్స్ ఖాతా నుంచి ఉద్యోగులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రగతికి దోహదపడుతున్న రాష్ట్ర ఉద్యోగులు, ఎయిడెడ్ విద్యా, సాంకేతిక విద్యాసంస్థలు, పట్టణ సంస్థలు, యూజీసీ ఉద్యోగులు, వర్క్‌చార్జ్డ్ ఉద్యోగులు, పింఛనుదారులందరూ దీని ప్రయోజనం పొందుతారని పోస్ట్ లో రాశారు. అంతేకాకుండా.. నాన్ గెజిటెడ్, టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్, రోజువారీ వేతన కార్మికులందరికీ 30 రోజుల వేతనాలకు (గరిష్టంగా రూ. 6908) బోనస్ ఇస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని 14.82 లక్షల మంది ఉద్యోగులు బోనస్ ప్రయోజనం పొందనున్నారు.
కేంద్రంతో సమానంగా డీఏ ఇస్తాం- ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్
రాష్ట్ర ఉద్యోగులకు కేంద్రంతో సమానంగా డియర్‌నెస్ అలవెన్స్ ఇస్తామని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ చెప్పారు. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం కరువు భత్యం ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్‌ను అనుమతి కోరింది. గతంలో రాజస్థాన్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపాదన సిద్ధం చేసి ఎన్నికల సంఘానికి పంపింది. అనుమతి పొందిన తరువాత రాజస్థాన్ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచారు. ఇదిలా ఉంటే.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఈ ఏడాది ఉద్యోగుల కరువు భత్యాన్ని రెండుసార్లు పెంచింది.
డీఏ పెంపుబాటలో చండీగఢ్, తమిళనాడు
తమిళనాడు, చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ తమ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపుదల ప్రయోజనాన్ని ఇవ్వాలని ప్రకటించింది. తమిళనాడు ప్రభుత్వం.. ఈ పెంపుదల జూలై 1 నుండి అమలు చేయనుంది. దీంతో 16 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాకుండా.. ప్రభుత్వ ఖజానాపై రూ.2500 కోట్లకు పైగా భారం పడనుంది.