NTV Telugu Site icon

WI vs IND Day 2 Highlights: రోహిత్‌, జైస్వాల్ సెంచరీలు.. భారీ ఆధిక్యం దిశగా భారత్!

Yashasvi Jaiswal Century

Yashasvi Jaiswal Century

West Indies vs India 1st Test Day 2 Highlights: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. అరంగేట్ర ప్లేయర్ యశస్వి జైస్వాల్ (143 బ్యాటింగ్; 350 బంతుల్లో 14 ఫోర్లు), కెప్టెన్ రోహిత్ శర్మ (103; 221 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో టీమిండియా పట్టుబిగించింది. రెండో రోజైన గురువారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 162 పరుగుల ఆధిక్యంలో ఉంది. యశస్వి జైస్వాల్ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (36) క్రీజులో ఉన్నాడు.

ఓవర్‌ నైట్ స్కోర్‌ 80/0తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ తొలి సెషన్‌లో వేగంగా పరుగులు చేయలేదు. రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌ ఆచితూచి బ్యాటింగ్‌ చేశారు. వెస్టిండీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. ఎక్కువగా డిఫెన్స్‌ ఆడారు. సింగిల్స్‌తో స్ట్రెక్‌రోటేట్ చేస్తూ వెళ్లారు. ఈ క్రమంలోనే జైస్వాల్ 104 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆపై రోహిత్‌ ఓ సిక్స్‌, ఫోర్‌ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ విరామ సమయానికి భారత్‌ 146/0తో నిలిచింది.

లంచ్‌ తర్వాత రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌ కాస్త దూకుడు పెంచారు. జైస్వాల్ ధాటిగా ఆడి 215 బంతుల్లో సెంచరీ చేశాడు. రోహిత్‌ 220 బంతుల్లో శతకం బాదాడు. సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాతి బంతికే రోహిత్‌ ఔట్ కాగా.. క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ (6) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. టీ బ్రేక్‌ సమయానికి భారత్ 245/2తో నిలిచింది. తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి యశస్వి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ సింగిల్స్‌ తీస్తూ జట్టు స్కోరు 300 దాటించారు. రెండో రోజు ముగిసేసరికి భారత్ 312 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 150 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.

Also Read: Gold Price Today: మహిళలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!

Also Read: Mahalaxmi Stotram: భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్రాలు వింటే దారిద్య్రానికి చోటు ఉండదు