West Bengal CM Mamata Banerjee React on Parliament Security Breach: ఇటీవల పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం తీవ్రమైన అంశం అని, పెద్ద తప్పిదమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి ఇప్పటికే అంగీకరించారని, ఈ ఘటనపై దర్యాప్తు చేయాలన్నారు. విపక్ష పార్టీల కూటమి ఇండియా సమావేశంలో పాల్గొనేందుకు సీఎం మమతా బెనర్జీ నేడు ఢిల్లీ పయనమయ్యారు. ఈ సందర్భంగా కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు.
పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇది భద్రతా లోపం. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి ఇప్పటికే అంగీకరించారు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఈ ఘటనపై విచారణ జరగనివ్వండి’ అని దీదీ అన్నారు. ‘ప్రతిపక్షాలు ఇప్పటికే ఈ సమస్యను లేవనెత్తాయి. అందుకే టీఎంసీ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్‌ను సస్పెండ్ చేశారు. ఇతర కాంగ్రెస్ మరియు డీఎంకే ఎంపీలను కూడా సస్పెండ్ చేశారు’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
Also Read: Arshdeep Singh: ఇబ్బంది పడతానేమో అనిపించింది.. రాహుల్ భాయ్‌కి కృతజ్ఞతలు: అర్ష్‌దీప్
ఆరోగ్య కేంద్రాలకు కాషాయ రంగు వేయాలన్న కేంద్రం ఆదేశాన్ని సీఎం మమతా బెనర్జీ మరోసారి ప్రస్తావించారు. ప్రజలు ఏం తినాలో, ఏం ధరించాలనే అంశాలను కూడా నిర్ణయించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఇక డిసెంబర్ 20న ప్రధాని నరేంద్ర మోడీతో దీదీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా బెంగాల్‌కు రావాల్సిన బకాయి నిధులను విడుదల చేయాలని ప్రధానిని కోరనున్నారు.