Delhi Police: దేశ రాజధానిలో 20 ఏళ్ల మహిళను కారు ఢీకొట్టి 13 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఘటన జరిగిన వారం తర్వాత ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1న జరిగిన ఈ ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబడింది. రాత్రి సమయంలో తాము విధులు నిర్వహించే లొకేషన్లను పంచుకోవాలని ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులందరినీ కోరారు. అన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌వో), యాంటీ టెర్రరిస్ట్ ఆఫీసర్లు (ఏటీవో), ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (బ్రావో) కూడా పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరే ముందు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కి తెలియజేయాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. అర్థరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు పోలీసులు విధులు నిర్వహించే ప్రాంతాలను లైవ్ లొకేషన్లతో అప్‌డేట్ చేసుకోవాలని విడుదల చేసిన ఆర్డర్‌లో పేర్కొన్నారు. జనవరి 1న యువతిని కారు 13 కిలోమీటర్లు లాక్కెళ్లిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
న్యూ ఇయర్ రోజున తెల్లవారుజామున 2 గంటల తర్వాత అంజలి సింగ్ తన స్నేహితురాలితో కలిసి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా కారు ఢీకొట్టింది. అంజలి కాలు ఒక చక్రానికి తగిలి ఆమెను కారు ఈడ్చుకెళ్లింది. మద్యం మత్తులో ఉన్న యువకులు కారును అలానే డ్రైవ్ చేశారు. ఆమె అరిచింది కానీ కారు ఆగలేదు, చక్రాల కింద ఆమె చేయి ఉందని వారు చూసినప్పటికీ కారును అలాగే పోనిచ్చారు. 13 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం మృతదేహం పడిపోయిన తర్వాత వారు కారును ఆపినట్లు తెలిసింది. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. అంజలి సింగ్ తన తల్లి, తమ్ముళ్లతో వాయవ్య ఢిల్లీలోని అమన్ విహార్‌లో నివసించారు. ఆమె తండ్రి కొన్నాళ్ల క్రితం చనిపోయారు.
Road Accident: పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మరణం
అంజలి తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఆమె కనీసం 40 బాహ్య గాయాలతో బాధపడింది. ఆమె వెనుక భాగంలో పక్కటెముకలు బయటపడ్డాయి. ఆమె పుర్రె భాగం పగిలి మెదడులోని కొంచెం భాగం చెల్లాచెదురైంది. ఆమె తల, వెన్నెముక, దిగువ అవయవాలకు గాయాలయ్యాయి. విచారణ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకోబడతాయని పోలీసులు వెల్లడించారు.