ప్రమాదం ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో ఊహించలేము. అప్పటి వరకు ఆనందం నిండిన చోట విషాదం నెలకొంటుంది. ఇదే రీతిలో తాజాగా ప్రమాదం కారణంగా ఓ పెళ్లి నిలిచిపోయింది. మరికాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకుతో పాటు ఆరుగురు తీవ్రంగా గాయపడగా ఓచిన్నారి మృతిచెందింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read:Chinnaswamy Stadium Stampede: మృతుల కుటుంబాలకు 20 కోట్లు ఇవ్వాలి!
జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఈ తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో పెళ్లి బృందం కారును డీసీఏం వ్యాను డీకొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకు మహేష్ తో పాటు ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో చిన్నారి రుద్ర (3) మృతి చెందింది. క్షత గాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిన్న రాత్రి మహారాష్ట్ర నాందేడ్ నుంచి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఓ వధువు తో పెళ్ళి జరగాల్సి ఉండగా హెర్టిగా కారులో ఈ బృందం బయలు దేరింది. కొండగట్టు వద్ద ఆగి టీ తాగి బయలుదేరిన కొద్దిసేపటికి డీసీఎం వ్యాను వేగంగా వచ్చి డీకొట్టింది. ఈ ప్రమాదంతో ఈ రోజు జరుగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. పెళ్లి వేడుక వేళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.