NTV Telugu Site icon

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలర్ట్‌.. మార్చి నుంచే వడగాడ్పులు!

Weather

Weather

Weather Alert: ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. ఎల్‌నినో పరిస్థితులు కొనసాగే సూచనలు ఉన్నందున ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగిపోనున్నాయని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా వడగాలులు ఉంటాయని అంచనా వేసింది. మార్చి నుంచి మే దాకా సాధారణం కంటే అధిక గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. భూమధ్య రేఖకు ఆనుకుని పసిఫిక్‌ మహాసముద్రంలో ప్రస్తుతం తీవ్రంగా ఉన్న ఎల్‌నినో పరిస్థితులు వేసవి చివరి వరకూ కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో పసిఫిక్‌లో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడిగా ఉండనున్నందున ఆ దిశగా వచ్చే గాలులతో దేశంలో మార్చి నుంచి మే నెల వరకూ మూడు నెలలు ఎండలు తీవ్రంగా ఉంటాయి.

Read Also: IIPE: పెట్రోలియం యూనివర్శిటీ నిర్మాణానికి నేడు భూమి పూజ

మార్చిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలో వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. మార్చి నుంచి మే వరకూ దేశంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. దీంతోపాటు వడగాడ్పులు వీచే రోజుల సంఖ్యా ఎక్కువ కానున్నాయి. దేశంలో అనుకూల వర్షపాతానికి కారణమైన లానినా పరిస్థితులు వర్షాకాలం మధ్య నుంచి ఏర్పడనున్నట్లు ఐఎండీ తెలిపింది. జూన్‌ నుంచి తటస్థ పరిస్థితులు ప్రారంభమై ఆగస్టు నాటికి లానినా మొదలవుతుందని ఐఎండీ అంచనా. నైరుతి రుతుపవనాల సీజన్ రెండో భాగం అంటే ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిఫుణులు చెబుతున్నారు.

Show comments