Shoaib Malik Feels Indian team should definitely come to Pakistan: 2025 ఫిబ్రవరి-మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. మొత్తం ఎనిమిది దేశాలు ఈ టోర్నీలో పాల్గొనబోతున్నాయి. టోర్నీ ప్రతిపాదిత షెడ్యూల్‌ను కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి అందించింది. అయితే భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా? అనే విషయంపై ఇపటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు టీమిండియా పాక్‌కు రావాల్సిందేనని అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పట్టుబడుతోంది. అయితే పాకిస్థాన్‌కు వెళ్లేందుకు బీసీసీఐ సుముఖంగా లేదు. భారత ప్రభుత్వం ఇందుకు అనుమతి ఇచ్చే అవకాశం లేదు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును పాకిస్థాన్‌కు పంపాలని బీసీసీఐని ఒప్పించే బాధ్యతను ఐసీసీకి పీసీబీ అప్పగించింది. చర్చలు జరుగుతున్న వేళ.. భారత ఆటగాళ్లు తమ దేశానికి రావాలని పాక్ మాజీ క్రికెటర్లు కోరుకుంటున్నారు. ఇప్పటికే మాజీ పేసర్ షోయబ్ అక్తర్, మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిలు పాకిస్థాన్‌కు వచ్చి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాలని కొరారు. తాజాగా ఈ జాబితాలో వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్ కూడా చేరాడు. టోర్నీలో ఆడేందుకు పాకిస్థాన్ రావాల్సిందిగా టీమిండియాను షోయబ్ అభ్యర్థించాడు. తాము చాలా మంచోళ్లం అని, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం అని చెప్పాడు.
Also Read: Suryakumar Yadav: ఇంజిన్ మారిందంతే.. టీమిండియా రైలు మాత్రం దూసుకెళ్తూనే ఉంటుంది!
తాజాగా క్రికెట్ పాకిస్థాన్‌తో షోయబ్ మాలిక్ మాట్లాడుతూ… ‘దేశాల మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా.. అది ప్రత్యేక సమస్య. దాన్ని విడివిడిగా పరిష్కరించుకోవాలి. క్రీడల్లోకి రాజకీయాలు రాకూడదు. గత సంవత్సరం పాకిస్తాన్ జట్టు భారతదేశానికి వెళ్లింది. ఇప్పుడు భారత జట్టు ఇక్కడకు రావడానికి ఇదే మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను. భారత జట్టులో పాకిస్థాన్‌లో ఆడని ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. వారికి ఈ పర్యటన మంచి అవకాశం. మేము చాలా మంచి వ్యక్తులం. మంచి ఆతిథ్యం ఇస్తాం. భారత జట్టు తప్పకుండా పాకిస్థాన్‌కు రావాలి’ అని అన్నాడు. భద్రత, ఇతర కారణాల వల్ల టీమిండియా చాలాకాలంగా పాక్ పర్యటనకు వెళ్లడం లేదు. భారత జట్టు చివరిసారిగా 2008 ఆసియా కప్ కోసం అక్కడికి వెళ్లింది.