NTV Telugu Site icon

HYDRA: చెరువుల అనుసంధానంతోనే వ‌ర‌ద‌కు క‌ట్టడి..

Hydra

Hydra

చెరువులు, నాలాల ప‌రిర‌క్షణ‌తో పాటు వాటికి పున‌రుజ్జీవ‌నం క‌ల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు, లేక్‌మ్యాన్స్‌, జ‌ల‌వ‌న‌రుల అభివృద్ధికి సంబంధించిన ప‌లువురు ప‌రిశోధ‌కులు, నిపుణ‌ల‌తో హైడ్రా స‌మావేశాలు నిర్వహించింది. గురువారం హైడ్రా కార్యాల‌యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ ఆధ్వర్యంలో వాటర్‌-ఉమెన్ రైట్స్ యాక్టవిస్టు డా. మ‌న్సీబాల్ భార్గవ‌తో హైడ్రా బృందం స‌మావేశ‌మైంది. న‌గ‌రంలో చెరువుల ప‌రిస్థితిపై స‌మీక్షించారు. వాటికి పున‌రుజ్జీవ‌నం క‌ల్పించేందుకు తీసుకుంటున్న చ‌ర్యల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్‌ వివ‌రించారు. హైడ్రా చ‌ర్యల‌ ప‌ట్ల డా. మ‌న్సీబాల్ భార్గవ హ‌ర్షం వ్యక్తం చేశారు. చెరువుల పున‌రుద్ధర‌ణ‌తోనే న‌గ‌రానికి వ‌ర‌ద‌ ముప్పు త‌ప్పుతుందంటూ ఆయన సూచించారు. అలాగే.. శ‌రీరానికి నాడీ వ్యవ‌స్థ ఎంత ముఖ్యమో.. చెరువుల‌కు నాలా వ్యవ‌స్థ అంతే అవ‌స‌రమ‌ని డా. మ‌న్సీబాల్ భార్గవ‌ తెలిపారు. నాలాలు స‌రిగా ఉంటే.. వ‌ర‌ద నీరు సాఫీగా చెరువుకు చేరుతుందని అన్నారు. అనుసంధానం ఉన్నప్పుడే ఒక దాని త‌ర్వాత మ‌రో చెరువు నిండుతుందని పేర్కొన్నారు. ఆ గొలుసు తెగ‌కుండా చూడాలి.. ఎక్కడైనా ఆటంకాలు ఏర్పడితే వాటిని పున‌రుద్ధరించాలని తెలిపారు.

CM Chandrababu: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం.. రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలు!

భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో బెంగ‌ళూరులోని చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి.. ఇలాంటి ప‌రిస్థితులు న‌గ‌రంలో త‌లెత్త కూడ‌దంటే చెరువుల అనుసంధానం, గొలుసుక‌ట్టు చెరువులు, నాలా వ్యవ‌స్థ స‌రిగా ఉండాల‌ని డా. మ‌న్సీబాల్ భార్గవ‌ సూచించారు. స‌హ‌జ‌ సిద్ధంగా చెరువుల‌కు పున‌రుజ్జీవ‌నం క‌ల్పించే ప‌ద్ధతుల‌ను వివ‌రించారు. చెరువుల‌కు కాలువులు జీవ‌నాడులు.. వాటిని ముందుగా ప‌రిర‌క్షించుకుంటూ.. ఆ కాలువ‌ల నుంచి మంచి నీరు వ‌చ్చేలా చూస్తే.. చెరువుల కాలుష్యం త‌గ్గుతుందంటూ సూచ‌న‌లు చేశారు. కాంక్రీట్ క‌ట్టడాలు కాకుండా.. స‌హ‌జ‌సిద్ధంగా చెరువుల‌ను పున‌రుద్ధరించిన‌ప్పడే వాటిలో జీవ‌క‌ళ ఉంటుంద‌ని.. ఆ నీరు జీవ‌రాసుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భార్గవ‌ తెలిపారు. ఇలా త‌క్కువ ఖ‌ర్చుతో చెరువుల‌కు పున‌రుజ్జీవ‌నం సాధ్యమౌతుందని అన్నారు.

Kaleshwaram Commission: మాజీ ఈఎన్సీని విచారించిన కాళేశ్వరం కమీషన్.. కీలక విషయాలు వెల్లడి

ఈ క్రమంలో.. ఆ విధానాలపై ఆయన ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్‌ ఇచ్చారు. నెల‌లో కుర‌వాల్సిన వ‌ర్షం ఒక్క రోజులోనే.. ఒక్క రోజులో కురిసే వ‌ర్షం.. ఒక గంట‌లో ప‌డి న‌గ‌ర జీవ‌నాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న వేళ.. వ‌ర‌ద నీటి కాలువ‌లు ఎలా ఉండాలనే అంశంపై లోతైన చ‌ర్చ జరిపారు. వ‌ర‌ద నీరు చెరువుకు చేరాలి.. చెరువులు నిండితే ఆ నీరు న‌దుల్లో క‌ల‌వాలన్నారు. అలా కాకుండా ఆటంకాలు ఏర్పడితే నివాసాలు నీట మునుగుతాయని తెలిపారు. చెరువుల‌లో ఆక్రమ‌ణ‌లు తొల‌గింపు.. న‌గ‌రం ముంపున‌కు గురి కాకుండా చేసిన శ‌స్త్ర చికిత్స లాంటిద‌ని డా. మ‌న్సీబాల్ భార్గవ‌ అన్నారు.