NTV Telugu Site icon

Pune Car Crash: బాధిత కుటుంబాలు దు:ఖంలో.. నిందితుడికేమో రాచమర్యాదలు

Pune

Pune

మహారాష్ట్రంలోని పూణెలో అత్యంత వేగంగా ర్యాష్ డ్రైవింగ్ చేసి అమ్మాయి, అబ్బాయి మృతికి కారణమైన బాలుడికి గంటల వ్యవధిలోనే బెయిల్ రావడం ఆశ్చర్యం కలిగిస్తుంటే.. ఇక పోలీస్ స్టేషన్‌లో అతగాడికి జరుగుతున్న రాచమర్యాదలు చూస్తుంటే ప్రజలు విస్తుపోతున్నారు.

 

ఓ వైపు బిడ్డల్ని కోల్పోయి కుటుంబ సభ్యులు దు:ఖంలో ఉంటే.. తాజాగా పోలీస్ స్టేషన్‌లో మైనర్ నిందితుడికి జరుగుతున్న రాచమర్యాదలు చూస్తుంటే బాధిత కుటుంబాలకు కడుపు మండిపోతుంది. పైగా 15 గంటల్లోనే నిందితుడికి న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం.. ప్రమాదంపై ఒక వ్యాసం రాసుకుని రమ్మని చెప్పడం మరింత మతిపోతుంది. కోర్టు తీర్పుపై న్యాయ కోవిదులు, ప్రజలు విస్తుపోతున్నారు. ఇక ప్రమాదంలో ఇద్దరు టెకీలు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. న్యాయం చేయాలని కోరుతున్నారు. అలాగే కోర్టు తీర్పుపై కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో నిందితుడు స్థానికంగా ప్రముఖ వ్యక్తి కుమారుడు కావడంతో పోలీసులు అతడిని వీఐపీలా ట్రీట్‌ చేసినట్లు తెలుస్తోంది. పోలీస్‌స్టేషన్‌లో అతడికి పిజ్జా, బిర్యానీ అందించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.

పుణెలో ఆదివారం తెల్లవారుజామున ఓ బైక్‌ను లగ్జరీ కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు టెకీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో కారు డ్రైవ్‌ చేసిన నిందితుడు ఓ మైనర్‌ బాలుడు అని గుర్తించిన పోలీసులు అతడిని, అతడితో పాటు ఉన్న స్నేహితులను యార్వాడ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ పోలీసుల అనుమతితో తల్లిదండ్రులు అతనికి పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీ ఆర్డర్‌ చేసినట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్‌ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తూ పోలీసుస్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు.

ఈ కేసులో నిందితుడికి 15 గంటల్లోనే బెయిల్‌ రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతడి బెయిల్‌ను రద్దు చేసి అరెస్టు చేయాలని మృతుల కుటుంబాలు డిమాండ్‌ చేస్తున్నాయి. బెయిల్‌ సమయంలో కోర్టు విధించిన షరతులు కూడా చర్చనీయాంశమయ్యాయి. 300 పదాల్లో ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో పని చేయాలంటూ న్యాయస్థానం చెప్పడం గమనార్హం.

మరోవైపు లైసెన్సు రాకుండానే బాలుడికి కారు ఇచ్చిన నిందితుడి తండ్రిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఘటన సమయంలో బాలుడు మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. అతడికి మద్యం విక్రయించిన రెండు బార్ల యజమానులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఓ బారును అధికారులు తాజాగా సీజ్‌ చేశారు.

ఇక ఈ ఘటనపై పోలీస్ అధికారులతో డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ సమీక్ష నిర్వహించారు. కోర్టు తీర్పును ఖండించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని.. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు.