సంక్రాంతి పండగ పురస్కరించుకొని ఐదు రోజుల సెలవు అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పునః ప్రారంభమైంది. వరుస సెలవుల అనంతరం మార్కెట్ యార్డు తెరుచుకోవండతో.. తమ పంటలను విక్రయించేందుకు రైతులు భారీగా తరలివచ్చారు. వేల సంఖ్యలో పత్తి, మిర్చి బస్తాలతో మార్కెట్ కళకళలాడుతోంది. ముఖ్యంగా తెల్ల బంగారం భారీగా వచ్చింది. రైతులు భారీగా తరలిరావడంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు.
ఈ రోజు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు సుమారు 5,000 బస్తాల మిర్చి బస్తాలు అమ్మకానికి వచ్చి ఉంటాయని అధికారులు అంచనా వేశారు. మిర్చి ధరలు నిలకడగా ఉన్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. తేజాలు క్వింటాకు రూ.14800, వండర్ హాట్ క్వింటాకు రూ.13000, యూఎస్ క్వింటాకు రూ.15000 రూపాయలు పలుకుతున్నట్లు అధికారులు తెలిపారు. పత్తి ధర క్వింటాకు రూ.7421గా ఉంది.
Also Read: Nalgonda Collector: ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు.. నల్గొండ కలెక్టర్ సంచలన నిర్ణయం!
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో సంక్రాంతి సెలవుల తర్వాత పత్తి కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. అయితే పత్తి ధరలో సీసీఐ కోత విధించింది. మార్కెట్ యార్డులో నాణ్యత పేరుతో మద్దతు ధరలో మరో రూ.50 రూపాయలు కోత విధించింది. మద్దతు ధర పత్తి క్వింటాకు రూ.7521గా ఉండగా.. ఇంతకు ముందు రూ.50 కోత విధించింది. తాజాగా మరో రూ.50 కోత పడింది. తగ్గించిన ధర నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇవ్వాళ్టి మద్దతు పత్తి ధర రూ.7421 మాత్రమే. 15 రోజుల వ్యవధిలో సీసీఐ అధికారులు వంద రూపాయలు కోత విధించారు. ప్రైవేట్ మార్కెట్‌లో పత్తి ధర క్వింటాల్‌కు రూ.7060 పలుకుతోంది.