Site icon NTV Telugu

Off The Record: కుతకుతలాడుతున్న అనంతపురం అర్బన్‌ పాలిటిక్స్‌..

Ananthapur

Ananthapur

ఎక్కువ మాట్లాడితే నీ పదవి ఊడుతుందని ఒకరు, నువ్వు ఊ…… అంటే ఊడిపోవడానికి అదేమీ నీ మనుషులు తయారు చేసిన కుర్చీ కాదు, ప్రజలిచ్చిన పోస్ట్‌ అని మరొకరు సవాళ్ళతో రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. వస్తా… సంగతేంటో చూస్తానని ఒకరు, రా… చూద్దాం…. అయామ్‌ వెయిటింగ్‌ అంటూ ఇంకొకరు సినిమా డైలాగ్స్‌తో యవ్వారాన్ని యమా రక్తి కట్టిస్తున్నారు. ఆచరణ సాధ్యంకాని ఆ సవాళ్ళు విసురుకుంటున్న ఇద్దరూ ఎవరు? వాతావరణం ఎందుకంత వేడెక్కింది?

Also Read:Botsa Satyanarayana : చంద్రబాబు కేసుల ఉపసంహరణ చట్ట విరుద్ధం

అనంతపురం అర్బన్ నియోజకవర్గ రాజకీయాలు గతంలో ఎన్నడూ లేనంతగా కుతకుత ఉడికిపోతున్నాయి. గడిచిన మూడు దశాబ్దాలుగా ఇక్కడి పాలిటిక్స్‌ని పరిశీలిస్తే…. ఎన్నికల సమయంలో తప్ప మిగతా టైంలో ఎవరి పని వాళ్ళదే. గెలుపోటములతో సంబంధం లేకుండా అనంత నేతలు కాస్త సంయమనం పాటిస్తుంటారు. కానీ…. 2024 ఎన్నికలకు ముందు నుంచి ఇక్కడి రాజకీయ వాతావరణం పూర్తిస్థాయిలో మారిపోయింది. అనూహ్యంగా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ తరపున అర్బన్ టికెట్ సాధించారు. జిల్లా వైసీపీలో అందరికంటే సీనియర్ అయిన అనంత వెంకటరామిరెడ్డి మీద పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి టిడిపిలో అంతర్గత కలహాలు ఓవైపు.. టిడిపి వర్సెస్ వైసీపీగా సాగుతున్న పోరు మరోవైపు నియోజకవర్గంలో పొలిటికల్‌ హీట్‌ పెంచేశాయి.

ప్రత్యేకించి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మేయర్ వసీం మధ్య గత కొన్ని రోజులుగా నడుస్తున్న మాటల యుద్ధం ఉద్రిక్తతలు పెంచుతోంది. వీరిద్దరి మధ్య గొడవలకు ప్రధానమైన కారణం అనంతపురం నగరపాలక సంస్థలో వైసీపీ పాలకవర్గం ఉండటమే. ఓవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ఇంకోవైపు వైసీపీ మేయర్ ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాలు విషయంలో ప్రతిసారి పేచీ వస్తోంది. ఏ పని చేయాలన్నా ఒకరు ఔను అంటే ఇంకొకరు కాదంటూ మోకాలడ్డుతున్నారు. అలా ప్రతి సందర్భంలోనూ… నాయకుల మధ్య మాటా మాటా పెరుగుతోంది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నా.. అక్కడ వైసీపీని కౌంటర్ చేస్తుంటారు. అదే ఊపులో… కొన్ని సందర్భాల్లో మేయర్‌ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం వివాదానికి కారణమవుతోంది.

గత ఐదేళ్లలో ఒక చిన్న డ్రైనేజీ కట్టలేదు, ఒక రోడ్డు కూడా వేయలేదంటూ ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే. గత వైసిపి ప్రభుత్వ హయాంలో నగరపాలక సంస్థలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కూడా ఆరోపిస్తున్నారు దగ్గుపాటి. మున్సిపల్‌ కార్మికులకు పంపిణీ చేసే పనిముట్ల నుంచి కుక్కలు పట్టుకునే వరకు… ప్రతి అంశంలోనూ అవినీతి జరిగిందన్నది ఎమ్మెల్యే మాట. మేయర్‌ మొత్తం నగరాన్నే కాకుండా…. చివరికి తన సొంత డివిజన్‌ని కూడా నిర్లక్ష్యం చేశారని, ఇక అభివృద్ధి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు శాసనసభ్యుడు దగ్గుపాటి. అయితే దీనికి కౌంటర్‌గా… తాను తన డివిజన్లోనే రెండు కోట్ల 40 లక్షల రూపాయలు పనులు చేపట్టానని…. కానీ, రాష్ట్రంలో అధికారం మారి కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిలో కొన్ని పనుల్ని ఆపేశారని చెబుతున్నారు మేయర్‌.

Also Read:Imran Khan: “మరణం” వార్తలకు చెక్.. ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిసేందుకు సోదరికి అనుమతి..

అయితే… ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మర్యాదగా ఉండదని, తాను అనుకుంటే పదవి ఊడిపోతుందంటూ మేయర్‌కు వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే. ఆ తర్వాత దీనికి మేయర్‌ వసీం కూడా చాలా గట్టిగా సమాధానం ఇచ్చారు. మేయర్ పదవి అంటే ఎమ్మెల్యే నియమించింది కాదని, ఆయన ఊడగొడతానంటే ఊడిపోవడానికి కేవలం కుర్చీ కాదని, 48 మంది కార్పొరేటర్ల మద్దతుతో వచ్చిన స్థానమని సీరియస్‌ అయ్యారు. ఇలా… క్రమంగా ఎమ్మెల్యే, మేయర్ మధ్య మాట మాట పెరిగిపోతూ చలికాలంలో కూడా సెగలు పుడుతున్నాయి. ఈ సెగలు ఇప్పట్లో చల్లారేలా కూడా కనిపించడం లేదన్నది స్థానికంగా ఈ వ్యవహారాలను పరిశీలిస్తున్నవాళ్ళ మాట. రెండు పార్టీలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు నో కాంప్రమైజ్‌ అంటుండటంతో… ఈ పరిణామాలు ఎట్నుంచి ఎటు వెళ్తాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.

Exit mobile version