Site icon NTV Telugu

Off The Record : అనిల్ కుమార్ పై సీఎం జగన్ కు ఫిర్యాదులు వెళ్లాయా..?

Ycp Nellore

Ycp Nellore

పోయినవాళ్ళు పోగా… మిగిలిన వాళ్ళలో కూడా ఐక్యత లేదా? పరస్పర విభేదాలతో నెల్లూరు వైసీపీలో వార్‌ పెద్దదవుతోందా? మంత్రి, మాజీ మంత్రి మధ్య యుద్ధం జిల్లా పార్టీని ఎటుతీసుకువెళ్తోంది? సీఎం జగన్‌కు ఫిర్యాదులు వెళ్ళినా…ఎవరూ ఎందుకు తగ్గడం లేదు? అసలు సింహపురి వైసీపీలో ఏం జగురుతోంది?

నెల్లూరు జిల్లా వైసీపీ నేతల మధ్య విభేదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఈ టైంలో మిగతా నేతల మధ్య ఐక్యత పెరగాల్సింది పోయి… కలహాలు మరింత ఎక్కువ అయ్యాయట. ప్రధానంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వ్యవహార శైలిపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిర్వహించే సమావేశాలకు అనిల్ కుమార్ యాదవ్ హాజరు కావడంలేదట. అటు అనిల్‌కు బాబాయ్ వరుసయ్యే రూప్ కుమార్ యాదవ్ ఆయనతో విభేదించి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా ఆయన సొంతంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. అనిల్ కుమార్ యాదవ్ వ్యవహార శైలిపై మంత్రి కాకాణి..ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి…జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారట.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల పార్టీకి దూరమయ్యారు. అదే టైంలో పార్టీ కీలక నాయకుల మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయి. రూరల్ పరిధిలోని అల్లిపురం దగ్గర అనిల్ అనుచరుడు లే ఔట్ వేశారు. నీటిపారుదల శాఖకు చెందిన స్థలాన్ని ఆక్రమించి అందులో కలిపేశారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనిల్ మద్దతిస్తున్నారన్నది లోకల్‌ టాక్‌. నెల్లూరు రూరల్ పరిధిలోనే ఉన్న కొత్తూరు అంబాపురం వద్ద ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారు. ఆ విషయంలో అనిల్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని దళిత సంఘాలు విమర్శిస్తున్నాయి. రూరల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్తగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో సంప్రదించకుండానే అన్ని వ్యవహారాల్లో అనిల్ జోక్యం చేసుకుంటున్నారట. ఈ విషయాన్ని ఆదాల మంత్రి కాకాణి దృష్టికి తీసుకెళ్ళారట.

మరోవైపు…ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మంత్రి కాకాణి సమావేశమయ్యారు. అదే సమయంలో హైదరాబాదులో ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని హుటాహుటిన నెల్లూరు పిలిపించారట. ఆ సమావేశంలో అనిల్ కుమార్ వ్యవహార శైలిపైనే ప్రధాన చర్చ జరిగిందట. సమన్వయం కోసం సీఎం జగన్ త్వరలోనే జిల్లా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించ బోతున్నారట. ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో కీలకమైన జిల్లాలో ఈ పరిస్థితి ఏంటని వైసీపీ అగ్రనాయకత్వం కూడా ఆగ్రహంతో ఉందట. నేతలు కలిసికట్టుగా పనిచేయకపోతే పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది గనుక జరగబోయే సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. జగన్‌తో మీటింగ్‌ తర్వాతైనా… నెల్లూరు నేతల మధ్య విభేదాలు తొలగుతాయో లేదో చూడాల్సిందే.

Exit mobile version