NTV Telugu Site icon

Wagner Mutiny: రష్యాలో వాగ్నర్ తిరుగుబాటు.. సంచలన వ్యాఖ్యలు చేసిన జెలెన్స్కీ

Zelensky

Zelensky

Wagner Mutiny: వాగ్నర్ గ్రూప్‌ తిరుగుబాటుతో ప్రస్తుతం రష్యాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాగ్నర్ గ్రూప్‌ చీఫ్ ప్రిగోజిన్ రష్యా ప్రజలను వెన్నుపోటు పొడిచారంటూ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ అన్నారు. తమ విషయంలో పుతిన్ పొరబడ్డారని, తాము దేశభక్తులమని ప్రిగోజిన్‌ అన్నారు. అలాగే ఈ దేశానికి కొత్త అధ్యక్షుడు వస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము ఎవ్వరికీ ద్రోహం చేయలేదని, ఏ ఒక్కరూ కూడా లొంగిపోవడం లేదని వాగ్నర్ గ్రూప్ చీఫ్ అన్నారు. ఎందుకంటే ఈ దేశాన్ని అవినీతి, అబద్ధాలు, బ్యూరోక్రసీలో మగ్గిపోవాలని కోరుకోవడం లేదన్నారు. పుతిన్‌ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని ప్రిగోజిన్ మండిపడ్డారు. రష్యాకు కొత్త అధ్యక్షుడు వస్తారని పుతిన్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. అలాగే వాగ్నర్ దళాలు రష్యా దక్షిణ ప్రాంత నగరాల నుంచి ముందుకు సాగుతున్నట్లు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు మీడియాకు వెల్లడించారు. వారు ప్రయాణిస్తోన్న మోటార్ వే మాస్కో నగరాన్ని కలుపుతుంది.

Also Read: Cruel Husband: కూతురు కోసం మూడేళ్లుగా వెతుకుతున్న తండ్రి.. ఆమె భర్త చేసిన పనికి షాక్

ఇదిలా ఉండగా.. తాజాగా వాగ్నర్‌ గ్రూప్‌ తిరుగుబాటుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. రష్యాలో మొదలైన ఈ అంతర్యుద్ధాన్ని ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెడును కోరేవారు అందులో అంతమవుతారని అన్నారు. కాగా.. వాగ్నర్ సైన్యం తిరుగుబాటుతో ఇన్ని రోజులు ఉక్రెయిన్‌లో మోగిన బాంబుల మోతలు ఇక రష్యాలో వినిపిస్తున్నాయి. వాగ్నర్ గ్రూపు సభ్యులు ప్రారంభించిన సాయుధ తిరుగుబాటు రష్యా స్వాభావిక రాజకీయ అస్థిరతకు నిదర్శనమని జెలెన్స్కీ అన్నారు.

Also Read: Yevgeny Prigozhin: ముందు దొంగ.. తర్వాత చెఫ్‌.. ఇప్పుడు రష్యాను ఉలిక్కిపడేలా చేశాడు.. ఎవరీ ప్రిగోజిన్‌?

రష్యా సైన్యం వాగ్నర్ సైన్యం తిరుగుబాటును అణిచివేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో వాగ్నర్ సేన లక్ష్యంతో వోరోనెజ్ సమీపంలోని హైవేపై మిలిటరీ బాంబుల వర్షం కురిపించింది. ఆ దృశ్యాలు స్థానికంగా భయానక వాతావరణాన్ని సృష్టించాయి. ప్రిగోజిన్ నాయకత్వంలోని వాగ్నర్ ప్రైవేటు సైన్యం ఇప్పటికే రస్తొవ్ దక్షిణ మిలటరీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు, అంతర్జాతీయ వ్యవహారాల ప్రధాన కార్యాలయాన్ని ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలిపింది. కానీ అధికారంగా రష్యా సైన్యం ధ్రువీకరించలేదు. జిల్లా మిలిటరీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో స్థానిక ప్రజలు పరుగులు పెడుతున్న దృశ్యాలు భయానక వాతావరణాన్ని సృష్టించాయి. రోస్తోవ్‌ నగరాన్ని ఆక్రమించామని వాగ్నర్ సేన ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఓ పెద్ద ఆయిల్ స్థావరంపై దాడి జరిగింది. చమురు డిపోలో మంటలు చెలరేగగా.. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వీటిని అదుపు చేయడానికి అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఇదిలా ఉంటే.. తాజా పరిణామాల నేపథ్యంలో పుతిన్‌కు రష్యా పార్లమెంట్ పూర్తి మద్దతు ప్రకటించింది.