NTV Telugu Site icon

Russia: రష్యాలో విమాన ప్రమాదం.. వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్‌ మృతి

Wagnor

Wagnor

Wagner chief Yevgeny Prigozhin Died in Plane Crash: రష్యాలో విమాన ప్రమాదం జరిగింది. . మాస్కో నుంచి సెయింట్‌ పీటర్స్ బర్గ్‌ వెళుతున్న విమానం బుధవారం మాస్కో ఉత్తర ప్రాంతంలోని ట్విర్‌ రీజియన్‌లో కుప్ప కూలింది.ఇది ఒక ప్రైవేట్ విమానం. ఇందులో 10 మంది ఉన్నారు. పైలెట్, క్రూ కాకుండా ఆరుగురు ప్రయాణీకులు కూడా ఉన్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో మిగలలేదు. ఇందులో విస్తుగొలిపే విషయం ఏంటంటే ఈ విమాన ప్రమాదంలో ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై తిరుగుబాటు చేసిన ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్‌ ప్రిగోజిన్ కూడా ఉన్నారు. అయితే ఈ విషయాన్ని రష్యా అధికారికంగా ప్రకటించలేదు. అయితే విమానంలో ప్రయాణించిన 10మంది పేర్లలో ఒక పేరు ప్రిగోజిన్ ఇంటి పేరుతో సహా సరిపోయిందని రష్యా వైమానిక సంస్థ రోసావియాట్సియా నిర్ధారించినట్టు రష్యా అధికారిక న్యూస్ ఏజెన్సీ టాస్‌ వెల్లడించింది.ఇదే విషయాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా పేర్కొ్నాయి. అయితే ఈ ప్రమాదం వెనుక పుతిన్ హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే రెండు నెలల క్రితం రష్యాలో అంతర్యుద్ధం ప్రకటించింది వాగ్నర్ గ్రూప్. అప్పుడు వాగ్నర్ గ్రూప్, ప్రిగోజిన్ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగాయి. ఈ సందర్భంగానే ప్రిగోజిన్ మరణం వెనకాల పుతిన్ ఉన్నాడేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Miyapur Firing: ఎలైట్ రెస్టారెంట్‌ జనరల్‌ మేనేజర్‌పై కాల్పులు.. అసలు కథ ఇదీ..!

ఇక వాగ్నర్ గ్రూప్ విషయానికి వస్తే 2014లో మొదటిసారి దీనిని ఏర్పాటు చేశారు. ఇది రష్యా ప్రైవేటు మిలటరీ దళంగా ఉండేది. 2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకోవడంతోనే వాగ్నర్ గ్రూప్ పుట్టుకొచ్చింది. దీనిలో చాలా మంది ఖైదీలే ఉండేవారు. 5000 మంది ఒక ప్రైవేటు సైన్యంలా పనిచేసేవారు. చాలా విషయాల్లో ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అండగా ఉండేది. ప్రిగోజిన్ కు ముద్దుగా పుతిన్ చెఫ్ అనే పేరు కూడా ఉండేది. మొదట్లో హాట్ డాగ్స్ అమ్మిన ప్రిగోజిన్ ఆ తరువాత రెస్టారెంట్లు, క్యాంటిన్ లు తెరిచాడు. అంతేకాదు రష్యా అధ్యక్షుడి అధికారిక భవనం క్రెమ్లి్న్ కు ఫుడ్ ను సరఫరా చేసేవాడు. దీంతో అతడికి పుతిన్ చెఫ్ అనే పేరు వచ్చింది. ఒకప్పుడు పుతిన్ కు కుడిభుజంలా ఉండేవాడు ప్రిగోజిన్. అయితే ఉక్రెయిన్ విషయంతో రష్యాకు ఎదురుతిరిగింది ఈ గ్రూప్ అంతర్యుద్ధాన్ని ప్రకటించింది. తరువాత ఆ విషయం సర్ధుమణిగింది. అయితే ఇంత సడెన్ గా విమానం కూలి ప్రిగోజిన్ మరణించడం పలు అనుమానాలకు తావిస్తుంది.

Show comments