Tamil Hero Vishal reacted on the Political Entry: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తాజాగా తన రాజకీయ పార్టీని ప్రకటించగా.. మరో తమిళ హీరో, తెలుగువాసి విశాల్ కూడా పార్టీ పెడుతున్నారని సోషల్ మీడియాలో ఇటీవలి రోజుల్లో తెగ ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై విశాల్ స్వయంగా స్పందించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని, భవిష్యత్తులో కాలం నిర్ణయిస్తే ప్రజల కోసం తప్పకుండా పోరాడుతా అని విశాల్ చెప్పారు.
‘నేడు రాజకీయాల్లోకి రావడం లేదు. నాకు ఇంత గుర్తింపు, హోదా ఇచ్చిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నాకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో దేవి ఫౌండేషన్ ద్వారా ఎందరినో ఆదుకున్నా. విద్యార్థులకు చదివిస్తున్నా, రైతులకు సాయం చేస్తున్నా. లాభాలను ఆశించి నేను ఏ పని చేయను. ఇప్పుడైతే నేడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. కాలం నిర్ణయిస్తే ప్రజల కోసం పోరాడుతా’ అని బుధవారం హీరో విశాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Also Read: NZ vs SA: రచిన్ రవీంద్ర సంచలన ఇన్నింగ్స్.. దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ రికార్డు విజయం!
మొదటి నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న విశాల్.. గతంలో ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని నామినేషన్ వేశారు. అయితే రిటర్నింగ్ అధికారులు ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. ఆపై తన అభిమాన సంఘాన్ని ‘విశాల్ మక్కల్ నల ఇయక్కం’ (విశాల్ ప్రజా సంక్షేమ సంఘం)గా మార్చి అన్ని జిల్లాల్లో ఇన్‌ఛార్జులను నియమించి.. బూత్ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఔట్‌డోర్ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు విశాల్ అక్కడి ప్రజల కష్టాలు తెలుసుకుని సాయం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయ పార్టీ పెడుతున్నారని ప్రచారం జరిగింది. కొద్ది రోజుల కిందట ఏపీ రాజకీయాల్లోకి విశాల్ ఎంట్రీ ఇస్తున్నాడని, వైసీపీ తరఫున కుప్పం నుంచి చంద్రబాబు నాయుడుపై పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఆ వార్తలను విశాల్ ఖండించారు.