విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్డింగ్ గడువు మరో ఐదురోజులు పొడిగించాలని యాజమాన్యం నిర్ణయించింది. నిర్ధేశించుకున్న గడువు ముగిసే సరికి 22దరఖాస్తులు రాగా వీటిలో దేశ, విదేశీ ఉక్కు రంగ పరిశ్రమలు ఆసక్తిని ప్రదర్శించాయి. సింగరేణి సహా ప్రభుత్వ రంగంలో ఉన్న కంపెనీలకు మరో అవకాశం కల్పించాలనే ఆలోచనలో ఆర్.ఐ.ఎన్.ఎల్. ఉంది. ఈ రేసులోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దూసుకుని వచ్చారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా అవసరమైన మూలధనం సేకరించాలనేది జేడీ ఆలోచన. మరోవైపు., కేంద్ర ప్రభుత్వం భిన్నమైన ప్రకటనలతో కడుపు మండిన ఉక్కు కార్మికులు పిడికిలిబిగించి సింహాచలం వరకు 25కిలోమీటర్ల పాదయాత్ర విజయవంతం అయింది.
Read Also: Bandi Sanjay: కేసీఆర్‌కి వారు మాత్రమే బలగం.. బీజేపీకి బలగం తెలంగాణ ప్రజలు
వారం రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ అనేక ఉత్కంఠ రేకెత్తించే పరిణామాలు జరిగాయి. రోజ్ గార్ మేళా కోసం వచ్చిన ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే వ్యాఖ్యలు తర్వాత కార్మికుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ప్రయివేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని చెప్పిన 48గంటలు తిరగక ముందే కేంద్రం పాత పాటే పాడి ఇరుకున పెట్టింది. దీంతో కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. రోడ్డెక్కి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. మరోవైపు 5వేల కోట్లుగా మూలధనం, మెటీరియల్స్ సేకరణ లక్ష్యంగా EOI ప్రకటించింది ఆర్.ఐ.ఎన్.ఎల్. గత నెల 27న నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ 15 కటాఫ్ డేట్ గా నిర్ధేశించుకుంది.
ఈ క్రమంలో అనూహ్యంగా 22 సంస్థల దగ్గర నుంచి దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఆరుగురు విదేశీ బిడ్డర్లు వున్నారు. ఉక్రెయిన్ నుంచి ఒక పరిశ్రమ ఆసక్తి వ్యక్తీకరణకు ముందుకు వచ్చింది. యుద్ధం కారణంగా అక్కడ పరిశ్రమలు మూతబడుతున్నాయని కనుక వైజాగ్ స్టీల్ ఇంపోర్ట్ చేసుకునేందుకు ముందుకు వచ్చింది. కీ ప్లేయర్స్ గా భావించి కార్మికులు స్వాగతం పలుకుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కొంత సమయం కోరినట్టు సమాచారం. ఇప్పటికే సింగరేణి కాలరీస్ లేదా ఆ ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దం అయ్యింది.చివరి నిముషం వరకు వేచి చూసిన ప్రభుత్వ రంగ పరిశ్రమలు నిర్ధేశించుకున్న సమయంలో ముందుకు రాకపోవడం నిరాశ పరిచింది.
ఇక, ఉక్కు పరిరక్షణ కోసం న్యాయపోరాటం చేస్తున్న మాజీ ఐపిఎస్ అధికారి లక్ష్మీ నారాయణ అనూహ్యంగా బిడ్డింగ్ బరిలోకి వచ్చారు. రెండు సీల్డ్ కవర్లలో EOI దాఖలు చేశారు. క్రౌడ్ ఫండ్ విధానంలో ఉక్కు నిర్వహణకు అవసరమైన నిధులు సేకరణ చేస్తామంటున్నారు జేడీ. కేంద్రం ద్వంద్వ విధానాలను నిరశిస్తూ స్టీల్ ప్లాంట్ ఉద్యమం మరోసారి ఉవ్వెత్తున ఎగసిపడింది….విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి సింహాచలం వరకు చేపట్టిన మహా పాదయాత్ర విజయ వంతం అయింది.
Read Also:Madhya Pradesh: కరోనాతో చనిపోయినట్లు ప్రకటించబడిన వ్యక్తి.. రెండేళ్ల తర్వాత సజీవంగా ఇంటికి..