NTV Telugu Site icon

Virat Kohli: వన్డే క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు!

Virat Kohli Half Century

Virat Kohli Half Century

Virat Kohli looks to break Sachin Tendulkar’s 50th ODI Century in IND vs NED: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ చేసినా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడిన కోహ్లీ 543 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. ఈరోజు నెదర్లాండ్స్ మ్యాచ్ నేపథ్యంలో వన్డే క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద రికార్డుపై కన్నేశాడు. అదే వన్డేల్లో 50వ సెంచరీ.

వన్డే క్రికెట్ చరిత్రలో ఎవరూ సాధించలేరు అనుకున్న దానిని విరాట్ కోహ్లీ సాధ్యం చేసి చూపించాడు. వన్డేల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును వన్డే ప్రపంచకప్ 2023లో కోహ్లీ సమం చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ 120 బంతుల్లో 100 మార్క్ అందుకున్నాడు. దాంతో కోహ్లీ ఖాతాలో 49వ సెంచరీ చేరింది. సచిన్ 452 ఇన్నింగ్స్‌ల్లో 49 శతకాలు బాదగా.. విరాట్ 277 ఇన్నింగ్స్‌ల్లోనే 49 సెంచరీలు చేశాడు.

మరో సెంచరీ బాదితే.. 50 వన్డే శతకాలు బాదిన మొట్టమొదటి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలుస్తాడు. వన్డేల్లో సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టాడానికి కోహ్లీ ఉవ్విల్లూరుతున్నాడు. ఇందుకు నెదర్లాండ్స్ మ్యాచ్ మంచి అవకాశం అని చెప్పాలి. ఇప్పటికే పటిష్ట జట్లపై చెలరేగిన కింగ్ కోహ్లీ.. పసికూన నెదర్లాండ్స్‌పై భారీ ఇన్నింగ్స్ ఆడడం అతడికి పెద్ద కష్టమేమి కాదు. ఇలాంటి ఛాన్స్ మళ్లీ మళ్లీ రాదు కూడా. సెమీస్ మ్యాచ్ ఉన్నా.. నెదర్లాండ్స్‌పైనే శతకం చేసి విరాట్ చరిత్ర సృష్టించాలని కోహ్లీ ఫాన్స్ కోరుకుంటున్నారు.

Also Read: Salaar Trailer: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్.. ‘సలార్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్ వచ్చేసింది!

సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 463 వన్డేలు ఆడి.. 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలతో 18,426 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 289 వన్డేలు ఆడి 49 సెంచరీలు, 70 హాఫ్ సెంచరీలతో 13,626 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్‌లలోసచిన్ 100 సెంచరీలు (టెస్టుల్లో 51, వన్డేల్లో 49) చేశాడు. కోహ్లీ ఇప్పటివరకు 79 శతకాలు (టెస్టులో 30, వన్డేల్లో 49, టీ20ల్లో 1) బాదాడు. నేడు నెదర్లాండ్స్‌పై శతకం బాదితే.. ఆ సంఖ్య 80కి చేరుకుంటుంది.