Virat Kohli రికార్డుల మోత.. ఖాతాలోకి మరో అరుదైన ఘనత.!

  • ఐపీఎల్ చరిత్రలో వరుసగా నాలుగు సీజన్లలో 600+ పరుగులు చేసిన తొలి బ్యాటర్‌
  • 2023, 2024, 2025, 2026 సీజన్లలో కోహ్లీ వరుసగా 600కు పైగా పరుగులు
  • క్వాలిఫయర్-1లో 25 బంతుల్లో 43 పరుగులు చేసి ఈ మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లీ..
Virat Kohli

Virat Kohli

Virat Kohli Record: Virat Kohli: టీమిండియా స్టాట్ బాట్స్మెన్ విరాట్ కోహ్లీ మరోసారి ఐపీఎల్ చరిత్రలో తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ధర్మశాలలో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా నాలుగు ఐపీఎల్ సీజన్లలో 600+ పరుగులు చేసిన తొలి బ్యాటర్‌ గా చరిత్ర సృష్టించాడు.

ఈ మ్యాచ్‌కు ముందు వరకు కోహ్లీ 2026 సీజన్‌లో 557 పరుగులతో కొనసాగుతున్నాడు. 600 పరుగుల మార్క్ చేరుకోవడానికి అతడికి మరో 43 పరుగులు అవసరమయ్యాయి. గుజరాత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆ మైలురాయిని 25 బంతుల్లో 43 పరుగులు చేసి అందుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 600 పరుగులు సాధించాడు. అతని సగటు 50.00 కాగా, స్ట్రైక్ రేట్ 164.38గా ఉంది. ఇది ఐపీఎల్‌లో కోహ్లీకి ఒక సీజన్‌లో అత్యుత్తమ స్ట్రైక్ రేట్. ఈ సీజన్‌లో అతడు ఒక సెంచరీతో పాటు నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అత్యధిక స్కోరు 105 పరుగులు.

కోహ్లీ ఈ ఘనతతో ఐపీఎల్‌లో అత్యధికంగా సీజన్లలో 600కు పైగా పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ మొత్తం 6 సార్లు ఈ మార్క్‌ను అందుకోగా, KL రాహుల్ నాలుగు సార్లు ఈ ఫీట్ సాధించాడు. శుభ్‌మ‌న్ గిల్, డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్ చెరో మూడు సార్లు 600+ పరుగులు చేశారు. అలాగే వరుసగా అత్యధిక సీజన్లలో 600కు పైగా పరుగులు చేసిన జాబితాలో కూడా కోహ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. 2023, 2024, 2025, 2026 సీజన్లలో వరుసగా 600కు పైగా పరుగులు సాధించిన అతడు, గతంలో మూడు వరుస సీజన్లలో ఈ ఘనత సాధించిన క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్‌ లను వెనక్కి నెట్టాడు.

మ్యాచ్‌లో కోహ్లీ ప్రారంభంలో కొంత నెమ్మదిగా ఆడాడు. ముఖ్యంగా కాగిసో రబడా బౌలింగ్‌లో కాస్త ఇబ్బంది పడ్డట్టుగా కనిపించినా.. అయితే ఆ తర్వాత తన శైలిలో గేర్ మార్చి పరుగుల వేగాన్ని పెంచాడు. ఎనిమిదో ఓవర్‌లో రషీద్ Khan బౌలింగ్‌లో సింగిల్ తీసి 43 పరుగుల మార్క్ చేరుకుని చారిత్రాత్మక రికార్డును నమోదు చేశాడు. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డును కోహ్లీ తనపేరిట కొనసాగిస్తున్నాడు. 2016 సీజన్‌లో అతడు ఏకంగా 973 పరుగులు చేసి రికార్డును నెలకొల్పాడు. మొత్తంగా ధర్మశాల వేదికగా జరిగిన ఐపీఎల్ ౨౦౨౬ క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) పై 92 పరుగుల భారీ తేడా విజయంతో సాధించి ఫైనల్‌ లోకి ఐదవసారి అడుగుపెట్టింది.