ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆధ్యాత్మిక యాత్రతో బిజీ అయ్యాడు. భార్య అనుష్క, కూతురు వామికాతో కలిసి స్వామీజీలను కలుస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నాడు. తాజాగా రిషికేష్‌లోని ఓ ఆశ్రమానికి వెళ్లాడు. రిషికేష్‌లోని స్వామి దయానంద్ గిరి ఆశ్రమంలో విరాట్ కనిపించాడు. అక్కడి బ్రహ్మాలిన్ దయానంద్ సరస్వతి సమాధిని సందర్శించాడని, ఆ తర్వాత గంగా ఘాట్‌లో గంగా హారతిలోనూ విరాట్ పాల్గొన్నాడని ఆశ్రమం పీఆర్వో గుణానంద్ రాయల్ వెల్లడించారు. రెండు రోజులుగా వీళ్లు ఆశ్రమంలోనే ఉన్నారు. కోహ్లీ, అనుష్కతో పాటు వాళ్ల యోగా ట్రైనర్ కూడా వెంట ఉన్నారు. మంగళవారం (జనవరి 31) ఉదయం ఆశ్రమంలో నిర్వహించే భండారా అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలోనూ వీరు పాల్గొన్నారు. ఈరోజు రాత్రి కూడా కోహ్లీ ఫ్యామిలీ ఆశ్రమంలోనే ఉండనుంది.
Virat Kohli with his family visit in Rishikesh.#ViratKohli𓃵 pic.twitter.com/cnPZ7UhlHE
— Flick of Wrist (@flickk_of_Wrist) January 30, 2023
ఇటీవలే కోహ్లీ, అనుష్క బృందావన్‌లోని ఆశ్రమానికి కూడా వెళ్లారు. అక్కడ శ్రీ పరమానంద ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాతే శ్రీలంకతో సిరీస్ ఆడాడు. ఆ సిరీస్‌లో విరాట్ రెండు సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ చెలరేగాలని భావిస్తున్న కోహ్లీ.. ఆ కీలకమైన సిరీస్ కు ముందు రిషికేష్ ఆశ్రమానికి వెళ్లాడు. ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ కోసం బుధవారం (ఫిబ్రవరి 1) ఆస్ట్రేలియా జట్టు ఇండియా రానుంది. నాగ్‌పూర్‌లో 9వ తేదీని మ్యాచ్ ప్రారంభం వరకూ బెంగళూరులోనే ఉండి ప్రాక్టీస్ చేయనుంది.