తెలంగాణ రాష్ట్రంలో.. బస్తీ దవాఖానాల తరహాలోనే గ్రామ దవాఖానలు కూడా త్వరలోనే రాబోతున్నాయని..దీని కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 5 లక్షలు ఆదాయం ఉండేట్టు చేశామని.. గ్రామ పంచాయతీ లు ఇప్పుడిప్పుడే లైన్ లో పడుతున్నాయని వెల్లడించారు. 12,769 గ్రామాల్లో 9 వేల కార్యదర్శుల పోస్టులు కొత్తవి వేశామని.. అన్ని పోస్టులకు ప్రమోషన్ కూడా ఇచ్చేశామని తెలిపారు. వారం కంటే ఎక్కువ కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉండొద్దు అని కలెక్టర్ లకు చెప్పామని వెల్లడించారు. కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. కానీ ఇప్పుడు కేంద్రానికే ఎక్కువ డబ్బులు ఇచ్చే స్టేట్ తెలంగాణ అని.. కేంద్రం మనకు ఇచ్చేది చాలా తక్కువ అని వెల్లడించారు. కేంద్రం నుండి వచ్చేది… కేంద్రం స్పాన్సర్డ్ నిధులు మాత్రమేనన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ల వైఖరి ఈ విషయం లో దొందు దొందేనని మండిపడ్డారు.