NTV Telugu Site icon

Kesineni Nani: చంద్రబాబు ఇచ్చే హామీలు బీజేపీ కూడా నమ్మట్లేదు..

Kesineni Nani

Kesineni Nani

Kesineni Nani: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతలు ప్రచార జోరును పెంచారు. విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేశినేని నాని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ విజయవాడ సెంట్రల్‌, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. మొదట విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి కేశినేని నాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఒక మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా కేశినేని నాని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అని ప్రజలందరూ చెబుతున్న పరిస్థితి ఉందన్నారు. బీజేపీతో సంబంధం లేకుండా మేనిఫెస్టో రిలీజ్ చేశారు.. చంద్రబాబు ఇచ్చే హామీలు బీజేపీ కూడా నమ్మట్లేదని విమర్శించారు. అందుకనే మేనిఫెస్టో నుంచి వాళ్ళ సింబల్, వాళ్ల ఫోటోలు పార్టీ పేరు లేకుండా మేనిఫెస్టో డిలీట్ చేశారన్నారు. కూటమిలో ముఖ్య భాగస్వామి చంద్రబాబు నాయుడిని నమ్మడం లేదు ఇంక ప్రజలేం నమ్ముతారు అని అందరూ అనుకుంటున్నారన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. వైయస్ఆర్సీపీ బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ గెలవబోతోందని కేశినేని నాని స్పష్టం చేశారు.

వైసీపీలోకి చేరికలు
అనంతరం జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి సామనేని ఉదయభానుతో కలిసి కేశినేని నాని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేటలో కేశినేని శ్రీనివాసరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ 29వ వార్డు కౌన్సిలర్ షేక్ సిరాజున్, ఆమె భర్త మార్కెట్ యార్డ్ మాజీ వైస్ ఛైర్మన్ సీనియర్ తెదేపా నేత షేక్ సత్తార్, పెద్ద ఎత్తున ముస్లింలు వైసీపీలో చేరారు. వారిని ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి సామినేని ఉదయభాను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత జగ్గయ్యపేట మండలం గౌరవరం, బండిపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు మే 13 దాకా కష్టపడి పని చేయాలని కేశినేని సూచించారు. వైసీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఐదు సంవత్సరాలు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయని.. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి పథకాలు పేద ప్రజల కోసం అమలు చేయలేదన్నారు. మరల అన్ని పథకాలు అందాలన్నా, సంక్షేమ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కావాలన్నా ప్రతి ఒక్కరు వైసీపీని గెలిపించాలని కేశినేని నాని కోరారు.

Show comments