TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి.. డీఎంకే, ఏఐడీఎంకే కంచుకోటల నుంచే విజయ్ పోటీ!

  • తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు
  • డీఎంకే, ఏఐడీఎంకే కంచుకోటల నుంచే విజయ్ పోటీ
  • తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి
TVK Vijay TN

TVK Vijay TN

తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్‌ ప్రకటించారు. ఈరోజు చెన్నైలో జరిగిన సభలో మొత్తం 234 స్థానాల్లో టీవీకే పోటీ చేయనుందని విజయం స్పష్టం చేశారు. పెరంబూర్‌, తిరుచ్చి ఈస్ట్‌ నుంచి విజయ్ బరిలోకి దిగుతున్నారు. తమిళనాడులో డీఎంకే, టీవీకే మధ్య ఎన్నికల పోరు ఉంటుందని విజయ్‌ అన్నారు. అయితే డీఎంకే, ఏఐడీఎంకే కంచుకోటల నుంచే విజయ్ పోటీ చేయడం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.

పెరంబూర్ నియోజకవర్గం సామాజిక సమీకరణ పరంగా కీలకమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఎస్సీ ఓటర్లు సుమారు 20 నుంచి 25 శాతం ఉండగా.. క్రిస్టియన్లు 8 నుంచి 12 శాతం, ముస్లింలు 10 నుంచి 15 శాతం వరకు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి స్థిరపడిన తెలుగు ఓటర్లు 20 నుంచి 25 శాతం వరకు ఉండటం విశేషం. పెరంబూర్ నియోజకవర్గం గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. డీఎంకే నాలుగు సార్లు, ఏఐడీఎంకే రెండు సార్లు విజయం సాధించాయి. దీంతో పెరంబూర్ డీఎంకేకు కంచుకోటగా భావిస్తారు. ఇలాంటి కీలక నియోజకవర్గం నుంచి విజయ్ పోటీ చేయడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Also Read: Vijay’s TVK Candidates List: టీవీకే అభ్యర్థుల జాబితా, మేనిఫెస్టో విడుదల.. రెండు స్థానాల్లో విజయ్ పోటీ!

ఇక తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం విషయానికి వస్తే.. ఇక్కడ బీసీ ఓటర్లు సుమారు 40 శాతం వరకు ఉన్నారు. ఎస్సీ వర్గం ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. తెలుగు ఓటర్లు 12 నుంచి 16 శాతం వరకు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో గత ఆరు ఎన్నికలలో డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు మూడేసి సార్లు విజయం సాధించాయి. దీంతో ఇక్కడ పోటీ సమానంగా ఉంటుందని భావిస్తున్నారు. డీఎంకే, ఏఐడీఎంకేలకు మంచి పట్టు ఉన్న పెరంబూర్‌, తిరుచ్చి ఈస్ట్‌ నుంచి విజయ్ బరిలోకి దిగుతుండడం అందరిలో ఆసక్తి నెలకొంది. రెండు కీలక నియోజకవర్గాలను ఎంచుకోవడం ద్వారా తన ప్రభావాన్ని చాటుకోవాలని విజయ్ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.