Romanchakam: భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ రోమాంచకం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన చేసిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో తన బంధం, అర్జున్ రెడ్డి రోజుల జ్ఞాపకాలు, యువతకు సందేశం అన్నీ కలిపి ఆయన ఈ సందర్బంగా మాట్లాడారు.
సందీప్‌పై తనకున్న ప్రేమను మాటల్లో చెప్పలేనని విజయ్ అన్నారు. “ఇది కేవలం దర్శకుడు-హీరో, స్నేహితులు లేదా సోదరుల బంధం కాదు. అంతకుమించింది” అన్నారు. అర్జున్ రెడ్డి సమయంలో ఇద్దరూ కలిసి ఒక యుద్ధమే చేశామని గుర్తు చేసుకున్నారు. అప్పుడు చేతిలో డబ్బు లేదు, ఇన్‌ఫ్లుయెన్స్ లేదు, పెళ్లిచూపులు కూడా రిలీజ్ కాలేదు. అలాంటి పరిస్థితిలో సందీప్, ప్రణయ్ అన్న, వాళ్ల నాన్న ప్రభాకర్ అంకుల్ పొలం అమ్మి సినిమా తీశారు. అంతటి రిస్క్ తీసుకున్న సందీప్ కోసం తాను ఎక్కడికైనా వెళ్తానని, సందీప్ కూడా తన కోసం ఎక్కడికైనా వస్తాడని చెప్పారు. “సందీప్ పిలిచాక ఈ ఈవెంట్‌కు రాకపోతే నేను బతికి వేస్ట్” అని ఎమోషనల్‌గా అన్నారు.
రౌడీవేర్ ఆఫీస్ దగ్గర సుమంత్ ప్రభాస్‌ను చూసేవాడినని విజయ్ చెప్పారు. అతని కళ్లలో సినిమా పట్ల ఉన్న తపన, డ్రీమ్ అప్పుడే కనిపించిందని.. ఒకరోజు నటుడో, దర్శకుడో అవుతాడని అనుకున్నానని అన్నారు. భద్రకాళి పిక్చర్స్ లోగో కనిపిస్తే ఇప్పటికీ అర్జున్ రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గుర్తొస్తుందని, ఆ బ్యానర్ తన సొంత బ్యానర్ లాంటిదని భావిస్తున్నట్లు చెప్పారు. సందీప్, ప్రణయ్ కలిసి సినిమా తీస్తున్నారంటే అది తప్పకుండా హిట్ కావాలని, దర్శకుడు వేణు, మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్, సుమంత్, అనంతిక అందరికీ పెద్ద సక్సెస్ రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మన హార్ట్‌లో ఫైర్ ఉండి, యాంబిషన్ ఉండి, నీపై నీకు నమ్మకం ఉంటే ఎప్పుడైనా సక్సెస్ కొట్టొచ్చు. బాయ్స్.. మీ అందరికీ చెబుతున్నాను. వర్క్‌ని ఎంజాయ్ చేస్తూ, మనలోని ఫైర్‌ను కొనసాగించగలిగితే ప్రపంచంలో ఏదీ మనల్ని ఆపలేదు” అని పేర్కొన్నారు. రోమాంచకం అంటే ఏమిటని అడిగితే.. 1989లో తాను పుట్టినప్పటి నుంచి తన జీవితమే రోమాంచకమని చెప్పారు. చేతిలో పైసలు ఉన్నా లేకపోయినా, ప్రేమలో పడినా.. హార్ట్‌బ్రేక్ అయినా.. ప్రతి క్షణం ఒక రోమాంచకమే అని అన్నారు. రోమాంచకం సినిమా సెప్టెంబర్ 3న విడుదల కానుంది. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా నటించిన ఈ చిత్రం లవ్, కామెడీ, థ్రిల్స్‌తో కూడిన యూత్ ఎంటర్‌టైనర్‌గా మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు.

