తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిలు విజిలెన్స్ నోటీసులపై స్పందించడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో తుడాలో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టిన విజిలెన్స్ విభాగం.. రెండుసార్లు నోటీసులు జారీ చేసింది. తుది నోటీసుకు సోమవారంతో గడువు ముగిసింది. భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డిలు అధికారుల ఎదుట హాజరుకాకపోవడంతో.. తదుపరి చర్యలకు విజిలెన్స్ సిద్దమవుతోంది. ఇపటివరకు సేకరించిన సమాచారంతోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు విజిలెన్స్ అధికారులు సిద్ధమవుతున్నారు.
Also Read: Chengalpattu Express Robbery: చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ.. కేబుల్ కత్తిరించి..!
వైఎస్ జగన్ హయాంలో తుడా చైర్మన్‌గా నాలుగేళ్ల పాటు అప్పటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చివరి ఏడాది ఆయన తనయుడు మోహిత్ రెడ్డి పని చేశారు. 2019-2024 మధ్య తుడా సంస్థ నిధులను భారీ ఎత్తున దారి మళ్లాయని కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఏడాదిగా విచారణ జరుగుతోంది. విచారణలో భాగంగా తుది నోటీసు 16వ తేదీన జారీ చేయగా.. ఇప్పటివరకు భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డిలు స్పందించలేదు. దాంతో తదుపరి చర్యలకు విజిలెన్స్ సిద్దమైంది. మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన భాస్కర్ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెల్సిందే.