NTV Telugu Site icon

Fake Tea Powder: రసాయనాలతో టీ పొడి.. రాజమండ్రి కేంద్రంగా నకిలీ గుట్టురట్టు

Fake Tea Powder

Fake Tea Powder

Fake Tea Powder: రాజమండ్రి కేంద్రంగా నకిలీ టీపొడి గుట్టు రట్టు చేశారు విజిలెన్స్ అధికారులు. రాజమండ్రిలో జోరుగా సాగుతున్నా టీ పొడి కల్తీ షాపులపై విజిలెన్స్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. రాజమండ్రిలో కల్తీ టీపొడి తయారీ, అమ్మకాల షాపులపై విజిలెన్స్ దాడులు చేసి టీపొడిలో కలుపుతున్న నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్ స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి టౌన్ హాల్ రోడ్డులో మూడు టీ రీప్యాకింగ్ హోల్ సేల్ షాపుల్లో తనిఖీలు జరిపారు. విజిలెన్స్, రెవిన్యూ, పుడ్ సేఫ్టీ , లీగల్ మెట్రాలజీ అధికారులతో కలిసి ఈ దాడులు చేశారు. శ్రీతేజ అస్సాం టీ షాపును తనిఖీ చేయగా ఫ్యాప్పీ సర్టిఫికేట్ లేనందున ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నోటీసులు జారీ చేశారు.. నిషేధించబడిన సింథటిక్ ఫుడ్ కలర్‌ టార్టాజైన్, సన్ సెట్ పసుపులను టీ పొడిలో కలపడాన్ని గుర్తించారు. టీ పౌడర్ ప్యాకెట్లలో టీపొడి నమూనాలను విశ్లేషణ కోసం సేకరించారు. టీ పొడిని కల్తీ చేయడానికి ఉపయోగిస్తున్న టార్టాజైన్ (పసుపు) సన్ సెట్ పసుపులను స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Pinnelli Ramakrishna Reddy: ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం.. లుకౌట్‌ నోటీసులు జారీ

ప్యాకింగ్ లైసెన్సు లేకపోవడం, టీ పౌడర్ ప్యాకెట్లపై కన్స్యూమర్ కేర్ వివరాలు లేకపోవడంతో లీగల్ మెట్రాలజీ అధికారులు కేసు నమోదు చేశారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌ను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నట్టు గుర్తించి కేసు పెట్టారు. గ్యాస్ సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు. టీ పొడిని కల్తీ చేయడానికి సింథటిక్ రంగులను ఉపయోగించినందుకు రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ ఐపీసీ 420, 272 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్‌కు సిఫారసు చేశారు. అలాగే రాజమండ్రి టౌన్ హాలు రోడ్డులోనే మరొకటి కీర్తి అస్సాం టీ షాపును విజిలెన్స్ అధికారుల బృందం తనిఖీ చేసింది. ఇక్కడ కూడా ఇదే తంతు కొనసాగుతుందని గుర్తించారు. నిషేధించిన సింథటిక్ ఫుడ్ కలర్‌ టార్టాజైన్, సన్ సెట్ పసుపులను టీ పొడిలో కలుపుతున్నట్టు గుర్తించారు. టీ పౌడర్ ప్యాకెట్లలో నమూనాలను విశ్లేషణకై సేకరించారు. ఎలాంటి లైసెన్సులు లేకుండా వ్యాపారం నిబంధనలకు విరుద్దంగా , కల్తీలతో టీపౌడర్ తయారు చేయడంపై వీరిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫారసు చేశారు. మరో అస్సాం టీ కంపెనీను తనిఖీకీలలో కూడా ఇవే విధమైన లోపాలు, నిబంధనల ఉల్లంఘన, టీపౌడర్ లో నిషేధిత పదార్ధాలు కలపడం వంటి పనులు చేస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ అస్సాం టీ కంపెనీపై కూడా కేసులు నమోదు చేశారు. రాజమండ్రి రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో కల్తీ ఆహార పదార్ధములు తయారు చేయుట, అమ్మడం చేస్తే సదరు వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.