Site icon NTV Telugu

CBI Arrested Videocon CEO: వీడియోకాన్ గ్రూప్ సీఈవోను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు

Venugopal Dhoot

Venugopal Dhoot

CBI Arrested Videocon CEO: ఐసీఐసీఐ బ్యాంకు రుణాల మంజూరు కేసులో వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) సోమవారం అరెస్టు చేసింది. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌కి సారథ్యం వహిస్తున్నప్పుడు వీడియోకాన్ గ్రూప్‌కు అందించిన రూ.3,000 కోట్లకు పైగా రుణంలో అవకతవకలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో ఆ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను సీబీఐ అరెస్టు చేసిన కొద్ది రెండు రోజుల తర్వాత ఇది జరిగింది. ముంబై కోర్టులో హాజరుపరిచిన తర్వాత కొచ్చర్‌లను ప్రస్తుతం అధికారులు విచారణ జరుగుతోంది.

2019లో అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం.. నేరపూరిత కుట్ర కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో దీపక్ కొచ్చర్, సుప్రీం ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిర్వహిస్తున్న నూపవర్ రెన్యూవబుల్స్ (ఎన్‌ఆర్‌ఎల్) కంపెనీలతో పాటు కొచర్స్, ధూత్‌లను సీబీఐ నిందితులుగా పేర్కొంది.

Read Also: Akash Chopra: మయాంక్‌ను కెప్టెన్ చేయొద్దు.. చేస్తే తప్పదు భారీ మూల్యం

కేసు అభియోగాల ప్రకారం, వీడియోకాన్ గ్రూప్‌కు 2010- 2012 మధ్య బ్యాంకు రుణం మంజూరు చేసిన నెలల తర్వాత, క్విడ్ ప్రోకోలో భాగంగా వేణుగోపాల్ ధూత్ న్యూపవర్ రెన్యూవబుల్స్‌లో రూ.64 కోట్లు పెట్టుబడి పెట్టాడు. కొచ్చర్ సభ్యులుగా ఉన్న కమిటీ ఈ రుణాన్ని క్లియర్ చేసిందని సీబీఐ ఆరోపించింది. ఆమె తన అధికారిక పదవిని దుర్వినియోగం చేసి, వీడియోకాన్‌కు రూ.300 కోట్లు మంజూరు చేసినందుకు ధూత్ నుంచి తన భర్త ద్వారా ప్రయోజనం పొందినట్లు ఏజెన్సీ పేర్కొ్ంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 20 బ్యాంకుల కన్సార్టియం నుంచి వీడియోకాన్ పొందిన రూ.40,000 కోట్ల రుణంలో ఇది భాగం.

Read Also: Pakistan: ఆర్థిక ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్న పాకిస్తాన్.. ఉద్యోగుల జీతాల్లో కోతలు

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ అయిన వీడియోకాన్ గ్రూప్‌కు అనుకూలంగా ఉన్నారనే ఆరోపణలపై ఐసిఐసిఐ బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న చందాకొచ్చర్ 2018 అక్టోబర్‌లో వైదొలిగారు. ఆమె బ్యాంక్ ప్రవర్తనా నియమావళిని, అంతర్గత విధానాలను ఉల్లంఘించిందని ఐసిఐసిఐ బ్యాంక్ తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, ఆర్‌బిఐ మార్గదర్శకాలు, బ్యాంక్ క్రెడిట్ పాలసీని ఉల్లంఘిస్తూ ధూత్ ప్రమోట్ చేసిన వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు ఐసిఐసిఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల మేరకు రుణాలను మంజూరు చేసిందని సీబీఐ ఆరోపించింది.

Exit mobile version