Site icon NTV Telugu

Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం కోసం గట్టి పోటీ.. సిద్ధూ, డీకేల్లో సీఎం ఎవరో?

Karnataka

Karnataka

Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఈ సాయంత్రం తన ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బెంగళూరులోని షాంగ్రీ-లా హోటల్‌లో సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ముఖ్యమంత్రి ఎంపికను నిర్ణయించడానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడికి వదిలివేసే తీర్మానాన్ని కాంగ్రెస్ శాసనసభా పక్షం ఆమోదించాలని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇద్దరూ ఉన్నత పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయం పరిష్కరించబడకపోతే పార్టీలో ప్రతిష్టంభన ఏర్పడుతుందనే భయాలు కాంగ్రెస్ పార్టీలో మొదలైనట్లు తెలుస్తోంది.

ఈ విజయాన్ని రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తూ, పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తానని హామీ ఇస్తూ శనివారం సాయంత్రం పార్టీ అగ్రనేతలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సోనియా గాంధీని కలవనున్నారు. ఈరోజు బెంగళూరులో జరిగే భారీ సమావేశానికి ఆయన హాజరుకావడం లేదు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా ఇప్పటికే బెంగళూరు చేరారు. అధిష్టానం ఎవరికి ఓటేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. వెనుకబడిన వర్గానికి చెందిన సిద్ధరామయ్య సీఎం రేసులో ముందంజలో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే పార్టీని అధికారంలోకి తేవడంలో ట్రబుల్‌ షూటర్‌ శివకుమార్‌ కూడా తీవ్రంగా శ్రమించారు. పైగా 61 ఏళ్ల డీకేకు గాంధీ కుటుంబం ఆశీస్సులున్నాయి. అయితే పార్టీ నేతల్లో అత్యధికుల మద్దతు సిద్ధరామయ్యకు ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Minister KTR: క‌ర్ణాట‌క ఫ‌లితాలు తెలంగాణ‌పై ఎటువంటి ప్రభావం చూప‌లేవు

వీరిద్దరి మధ్య వివాదాలకు తావు లేని రీతిలో అధికార పంపిణీ చేయాలని అధిష్ఠానం యోచనగా చెబుతున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన 75 ఏళ్ల సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి, డీకేకు డిప్యూటీ, లేదా కీలక మంత్రి పదవి ఇచ్చి కొంతకాలానికి వారిని పరస్పరం మారుస్తారని భావిస్తున్నారు. దళిత నేత వైపు అధిష్ఠానం మొగ్గితే పరమేశ్వరకు ఛాన్స్ ఉంటుంది.

Exit mobile version