Vice President Election 2025: ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే మంగళవారం నిర్వహించనున్న ఎన్నిక సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు సమాచారం. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి స్థానానికి ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. మీకు తెలుసా.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో రహస్య ఓటింగ్ విధానాన్ని అనుసరిస్తారు. రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో కూడుకున్న ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు తమకు నచ్చిన వారికి ఓటు వేసే వెసులుబాటు ఉంటుంది. అధికార ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ఎన్నిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. విపక్ష అభ్యర్థి.. పార్టీలకు అతీతంగా ఎంపీలు ఓటు వినియోగించుకోవాలని ప్రచారం చేయడంతో ఎన్నికపై కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఎన్నికలో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటముల బలాబలాలు ఎంత, విజయం ఎవరిని వరించడానికి ఎక్కువ అవకాశం ఉందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: YS Sharmila : తన కుమారుడు రాజా రెడ్డి రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ శర్మిల
391 మెజార్టీ మార్క్‌ను దాటేది ఎవరూ..
ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే మొత్తం ఎలక్టోర్ల సంఖ్య 781. లోక్‌సభ 542, రాజ్యసభలో 239 సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికలో పాల్గొనే లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడి ఓటు విలువ ఒకటిగానే పరిగణిస్తారు. ఈ ఎన్నికలో మెజార్టీ మార్కు 391. మీకు తెలుసా ఇప్పటికే అధికార ఎన్డీఏ కూటమికి 422 సభ్యుల బలముంది. దీంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది. విపక్షాల ఇండియా కూటమికి 311 మంది బలముంది. ఇతరులు 45 మంది ఉన్నారు. వీరితో సహా కొన్ని పార్టీలు మద్దతిచ్చినా విపక్ష అభ్యర్థి విజయానికి దూరంగానే కనిపిస్తున్నారు. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఎన్డీఏకు మెజార్టీ పెరిగే అవకాశం ఉంది. దీంతో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పార్టీలకు అతీతంగా ఆలోచించి ఓటు వేయాలని ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రచారం ఎంత వరకు ఫలితం ఇస్తుందనేది మంగళవారం తేలనుంది.
ఈ పార్టీల దారి ఎటు..
విపక్షాల అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ఆన్ఆద్మీ (10 మంది ఎంపీలు) ప్రకటించినప్పటికీ.. ఎంపీ స్వాతి మాలివాల్ ఆ పార్టీతో సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఆమె ఎవరికి ఓటు వేస్తారనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు భారత రాష్ట్ర సమితి (BRS) తాజాగా ప్రకటించింది. దీంతో ఈ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు ఓటింగ్లో పాల్గొనే అవకాశం లేదు. బిజు జనతాదళ్ (BJD)కు ఏడుగురు ఎంపీలున్న ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. శిరోమణి అకాలీదళ్, జోరమ్ పీపుల్స్ మూమెంట్ (మిజోరం) వంటి పార్టీలకు ఒక్కో సభ్యులున్నారు.
స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీ సభ్యులు ఎన్డీఏ వర్సెస్ ఇండియా పోటీలో ఎవరి పక్షంలో ఉంటారనే రేపటి వరకు వేడి చూడాలి.
READ ALSO: Jerusalem: జెరూసలేంలో రక్తపాతం .. హమాస్ కాల్పుల్లో ఇజ్రాయెల్ పౌరులు మృతి