NTV Telugu Site icon

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. నేడు తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు

Tirumala

Tirumala

Tirumala: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అపర భక్తురాలైన తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు మే 22వ తేదీన తిరుమలలో వైభవంగా జరగనున్నాయి. సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యాణవనంలో శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి బుల్లెమ్మ బృందం తరిగొండ వెంగమాంబ సంకీర్తనలను ఆలపించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి సమర్పిస్తారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిజీ అనుగ్రహభాషణం చేయనున్నారు. మరోవైపు ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో నృశింహ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. యోగ నరసింహస్వామివారి మూల‌మూర్తికి ప్రత్యేక అభిషేకం చేయనున్నారు. వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా తిరుమల‌ వసంత మండపంలో మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల‌ వరకు నరసింహస్వామి వారి పూజ నిర్వహిస్తారు. ఆలయంలోని యోగనరశింహ స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు అర్చకులు. ఇదిలా ఉండగా.. నేటి నుండి మూడురోజుల పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలు జరగనున్నాయి.

Read Also: Weather: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం.. 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు!

తిరుమలలో ఈ నెల 23న(రేపు) వైశాఖ పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భక్తులను కటాక్షించనున్నారు.మరో వైపు.. రేపు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టికెట్లను విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి.

మరోవైపు నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 80,744 మంది భక్తులు దర్శించుకోగా.. 35,726 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మంగళవారం హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.