Site icon NTV Telugu

VB Foundation : మహిళలకు అండగా వీబీ ఫౌండేషన్‌.. కుట్టుమిషన్లు పంపిణీ

Vb Foundation

Vb Foundation

ఎంతోమంది అనాథలను అక్కున చేర్చుకుంటూ.. పేద మహిళలకు భరోసా ఇస్తూ మద్దతుగా నిలుస్తోంది వీబీ ఫౌండేషన్‌. మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి నిర్వహిస్తున్న ఈ ఫౌండేషన్‌ మరోసారి మహిళలకు అండగా నిలిచి.. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లకు చెందిన మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు రాష్ట్రంలో వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రూ.4500 కోట్లు వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తోందని తెలిపారు.

Also Read : Puvvada Ajay Kumar : ప్రజలు ఆగం కావద్దు.. టక్కు టమరా గోకర్ణ విద్యలు ప్రదర్శిస్తారు…

అయితే.. ఆ వడ్డీలేని రుణాలను కేసీఆర్ ప్రభుత్వం అర్హులకు అందజేయడం లేదని ఆయన ఆరోపించారు. ప్రధాని మోడీ పీఎం విశ్వకర్మ పథకం పేరిట ఓబీసీ వర్గాల కోసం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నారని, పేద ప్రజలపై వంట గ్యాస్ భారం తగ్గించేందుకు ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ సందర్భంగా బండారు విజయలక్ష్మీ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, స్వశక్తితో ఆర్థిక ప్రగతిని సాధించాలని ఆమె వ్యాఖ్యానించారు. స్వచ్ఛంద సంస్థలు అందించే సేవలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తును బంగారు మయం చేసుకోవాలని బండారు విజయలక్ష్మీ అన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు ఎ.వినయ్కమార్, కార్పొరేటర్లు రచనశ్రీ, సుప్రియ నవీన్ గౌడ్, మహిళామోర్చా కన్వీనర్ మాధవి, నాయకులు రత్నసాయిచంద్, అరుణ్ కుమార్, రవికుమార్, బద్రినారాయణ, ఆర్.నరేష్, మహేందర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version