Jail Department Distribution Seed Ball in Parigi: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘వన మహోత్సవం’ 2025 కార్యక్రమం విజయంవంతంగా ముందుకు సాగుతోంది. వికారాబాద్ జిల్లా పరిగి జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పరిగి సబ్ జైలు సూపర్ఇండెంట్ రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు పరిగి ప్రాంత శివారులో నేషనల్ హైవే 163 రోడ్డుకి ఇరు వైపుల ఖాళీగా ఉన్న బీడు భూములలో జైలు శాఖ అధికారులు 2000 సీడ్ బాల్స్ చల్లారు. సీడ్ బాల్స్ చల్లడం అనేది తక్కువ శ్రమతో ఎక్కువ విస్తీర్ణంలో మొక్కలు నాటే కార్యక్రమం.
సీడ్ బాల్స్‌లో ఉండే విత్తనాలు వర్షా కాలంలో వర్షాన్ని వినియోగించుకొని.. మొక్కలుగా, ఆ మొక్కలు వృక్షాలుగా మారుతాయని సూపర్ఇండెంట్ రాజ్ కుమార్ తెలిపారు. ఈ సీడ్ బాల్స్‌కు నిర్దేశించిన ప్రదేశమని కాకుండా.. ఎక్కువ విస్తీర్ణం ఆక్రమించుకుని మొక్కలుగా మారే అవకాశం ఉందన్నారు. ప్రత్యక్షంగా మొక్కలు నాటే అవకాశం లేని చోట కూడా ఈ సీడ్ బాల్స్ ద్వారా మనం పరోక్షంగా మొక్కలు నాటవచ్చునని చెప్పారు. ఈ సీడ్ బాల్స్ ద్వారా మనం కృత్రిమ పద్దతిలో సహజ అడవులను కూడా సృష్టించవచ్చు అని తెలిపారు.
Also Read: MLA Sri Ganesh: ఎమ్మెల్యే శ్రీ గణేశ్‌పై దాడి.. పోలీసుల దర్యాప్తు వేగవంతం!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జైళ్ల శాఖ ఇప్పటివరకు 2 లక్షల సీడ్ బాల్స్ తయారు చేసి చల్లడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్ల పెట్రోల్ బంక్‌లలో సీడ్ బాల్స్‌ని ఉచితంగా పంపిణి చేస్తున్నారు. ప్రకృతిని పరిరక్షించాలనే సంకల్పంతో చేపట్టిన వన మహోత్సవం 2025 కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఏ నెల ఆరంభంలో ప్రారంభించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 18 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.