NTV Telugu Site icon

Tirumala: తిరుమలలో ఆ పది రోజులు వైకుంఠ ద్వార దర్శనం.. విశిష్టత ఇదే..

Tirumala

Tirumala

Tirumala: పవిత్ర పుణ్యక్షేత్ర తిరుమలకు నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని కనులారా దర్శించుకొసే అదృష్టం.. ప్రార్థించే అవకాశం కోసం కోట్ల మంది ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే భక్తుల సౌకర్యం కోసం.. టీటీడీ అనేక రకాల చర్యలు చేపడుతోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాట్లు చేస్తుంది. వైష్ణవాలయాల సంప్రదాయాలను పాటిస్తూ తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్‌ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెరచి ఉంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

Read Also: CM YS Jagan: ఎమ్మెల్యేలతో కొనసాగుతున్న సీఎం జగన్‌ వరుస భేటీలు

ఈ పది రోజులులో ఏ రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నా.. భక్తులకు ఒకేరకమైన పుణ్యఫలం లభిస్తుందని ఆయన తెలిపారు, ఈ పది రోజుల పాటు సిఫార్సు లేఖలను స్వీకరించమని.. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా విచ్చేస్తే వారికి మాత్రమే టిక్కెట్లు జారీ చేస్తామన్నారు. తిరుమలలో వసతి సౌకర్యం పరిమితంగా వుండడంతో భక్తులకు తిరుపతిలోనే వసతి సౌకర్యం పొందాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. సర్వదర్శన భక్తులుకు పది రోజులుకు సంబంధించి 4.25 లక్షల టోకెన్లు 22వ తేదీ నుంచి తిరుపతిలో జారీ చేస్తామన్నారు.

టోకెన్ పొందిన భక్తులు 24 గంటల ముందుగా మాత్రమే తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేశారు. దర్శన టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే తిరుమలలో వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. టోకెన్ లేని భక్తులు తిరుమలకు విచ్చేసినా వారికి వసతి, దర్శన సౌకర్యం లభించదన్నారు. 23వ తేది ఉదయం 9 గంటలకు స్వర్ణరథం ఊరేగింపు నిర్వహిస్తామని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.