భారత క్రికెట్‌లో ఒక సరికొత్త సంచలనం ఆవిర్భవించింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. భవిష్యత్తులో అతను సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల తరహాలో గొప్ప గుర్తింపు తెచ్చుకుంటాడని విశ్లేషకులు భావిస్తున్నారు. తన మొదటి మ్యాచ్‌లో వైభవ్ 14 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, ఇంగ్లాండ్ స్టార్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ బౌలింగ్‌లో అద్భుతమైన సిక్సర్లు బాది అందరినీ ఆకట్టుకున్నాడు.
అయితే, ఈ యువ ఆటగాడిని తుది జట్టులోకి తీసుకోవడం కోసం టీమ్ మేనేజ్‌మెంట్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. టీ20 ప్రపంచ కప్ 2026లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది. సంజు శాంసన్ ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో ఫామ్ కోల్పోయి తక్కువ పరుగులకే అవుట్ కావడంతో మేనేజ్‌మెంట్ ఈ మార్పు చేసింది.
కానీ.. కోచ్, కెప్టెన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంజు శాంసన్ లాంటి ఆటగాడిని తొలగించడం విడ్డూరంగా ఉందన్నారు. శాంసన్‌కు గాయం కావడం వల్లే పక్కన పెట్టారని తాను భావిస్తున్నానని, ఒకవేళ అది నిజం కాకపోతే ఇది అత్యంత విచిత్రమైన ఎంపిక అవుతుందని విమర్శించారు. వైభవ్‌ను జట్టులోకి తీసుకోవాలనుకుంటే, శాంసన్‌ను కాదని కాకుండా అతడిని నంబర్ 3 స్థానంలో ఆడించవచ్చని మంజ్రేకర్ సూచించారు.
మరోవైపు, ఈ రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. ఇషాన్ కిషన్ (49), అభిషేక్ శర్మ (43), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (37) రాణించడంతో 7 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే, ఇంగ్లాండ్ బ్యాటర్ జేకబ్ బెథెల్ కేవలం 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లాండ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

