Vaibhav Sooryavanshi తమ్ముడి సెంచరీపై వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ ఇదే..

Vaibhav Sooryavanshi Reacts

Vaibhav Sooryavanshi Reacts

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘సూర్యవంశీ’ కుటుంబం పేరే మార్మోగిపోతోంది. ఇప్పటివరకు తన సంచలన బ్యాటింగ్‌తో అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ ఒకెత్తయితే, ఇప్పుడు అతని తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ సైతం అన్న బాటలోనే పయనిస్తూ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. బిహార్‌లోని సమస్తీపూర్ పరిధిలో గల క్రికెట్ అకాడమీ తాజ్‌పూర్ తరఫున ఆడిన ఓ స్థానిక ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆశీర్వాద్ చెలరేగిపోయాడు. 87 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది, 118.39 స్ట్రైక్ రేట్‌తో 103 పరుగులు చేసి అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. మరోవైపు, తమ్ముడి వీరోచిత ఇన్నింగ్స్‌కు అన్న వైభవ్ మురిసిపోయాడు. సోషల్ మీడియా వేదికగా ఆశీర్వాద్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తప్పుడి చిత్రాన్ని పంచుకుని కంగ్రాట్యులేషన్స్ ఆశీర్వాద్ అని రాసుకొచ్చాడు.

నిజానికి వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరద పారించి చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో ఆడిన 16 మ్యాచ్‌ల్లో ఏకంగా 776 పరుగులు సాధించి, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి మరీ ప్రతిష్టాత్మక ‘ఆరెంజ్ క్యాప్’ను కైవసం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో చూపించిన ఈ అసాధారణ ప్రతిభతో జూన్ 6న వైభవ్‌కు తొలిసారిగా భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. వైభవ్ టీమిండియాకు ఎంపికయ్యాడనే వార్త తెలిసిన వెంటనే బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లా తాజ్‌పూర్ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. చుట్టుపక్కల వారు, బంధువులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో వైభవ్ ఇంటికి తరలివచ్చారు. ఒకరికొకరు లడ్డూలు తినిపించుకుంటూ, బాణసంచా కాలుస్తూ సంబరాల్లో మునిగిపోయారు. కొడుకు సాధించిన ఈ ఘనతతో వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా ఆయన ఓ వార్తాసంస్థతో తన సంతోషాన్ని పంచుకుంటూ, “టీమిండియా ఎంపిక ప్రకటన వచ్చినప్పుడు తామంతా ఇంట్లోనే ఉన్నామని, ఏదో ఒక మంచి వార్త వింటామని ఎంతో ఆశగా ఎదురుచూశామన్నారు. సెలెక్షన్ వార్త వినగానే తమ కుటుంబంతో పాటు సమాజం, గ్రామంలోని ప్రజలంతా ఇంటికి వచ్చి అభినందనలు తెలిపారని చెప్పారు. స్వీట్లు పంచుకుంటూ, టపాసులు కాలుస్తూ అందరూ ఎంతో సంబరపడ్డారని గుర్తుచేసుకున్నారు. వైభవ్ చిన్నతనం నుంచే దేశం తరఫున ఆడాలనే ఏకైక లక్ష్యంతో రాత్రింబగళ్లు కష్టపడ్డాడని, ఈ రోజు అతని కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని భావోద్వేగానికి గురయ్యారు. దేశానికి ప్రాతినిధ్యం వహించే ‘సౌభాగ్యం’ తన కొడుక్కు దక్కడం మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తోందని” ఆయన ఎంతో గర్వంగా చెప్పుకొచ్చారు.

×
×
Ad