Chlorine gas leak in Uttarakhand: ఉత్తరఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో క్లోరిన్ గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. డెహ్రాడూన్‌కు సమీపంలోని ఝంజ్రాలో క్లోరిన్ గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల సహాయక చర్యలతో అక్కడ పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
ప్రేమ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఝంజ్రా ప్రాంతంలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఓ ప్లాట్‌లో ఈరోజు ఉదయం క్లోరిన్ సిలిండర్‌ల నుంచి గ్యాస్ లీక్ అయింది. దాంతో సమీపంలోని ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. గ్యాస్ లీకేజీ సమాచారం అందిన వెంటనే ఎస్‌ఎస్పీ అజయ్‌సింగ్ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు అగ్నిమాపక శాఖ, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
Also Read: IndiGo Ticket Price: ప్రయాణికులకు షాక్.. ఇండిగో సీటు కోసం రూ. 2000 అదనంగా చెల్లించాల్సిందే!
ఝంజ్రా సమీపంలో ఉన్న నివాసాల్లోని ప్రజలను పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. క్లోరిన్ గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు వారు తీవ్రంగా శ్రమించారు. క్లోరిన్ గ్యాస్ సిలిండర్లను గొయ్యి తవ్వి పూడ్చివేశారు. ఈ ఘటనపై సాహస్‌పూర్ ఎమ్మెల్యే సహదేవ్ సింగ్ స్పదిస్తూ.. ‘7 క్లోరిన్ సిలిండర్లు ఖాళీగా ఉన్న ఇంట్లో ఉన్నాయి. ఆ సిలిండర్ల నుంచి క్లోరిన్ లీకేజీ అయి ప్రమాదాకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎస్ బృందాలు చర్యలు తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు’ అని చెప్పారు.