JD Vance: అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి (Republican Party) భారీ షాక్ ఇచ్చాయి. డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల సభ, సెనెట్ రెండింటిలోనూ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో వాషింగ్టన్ (Washington) రాజకీయాల్లో పవర్ బ్యాలెన్స్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఓటమి వైట్ హౌస్ (White House) అంతర్గత విభేదాలను కూడా బయటపెట్టింది. ముఖ్యంగా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) మధ్య అభిప్రాయభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి.
మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లు కాంగ్రెస్ (US Congress) రెండు సభలలోనూ ఆధిపత్యాన్ని కోల్పోయారు. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు గాను మెజారిటీ మార్కు 218 కాగా, డెమోక్రాట్లు 228 స్థానాలు సాధించగా, రిపబ్లికన్లకు కేవలం 139 సీట్లు మాత్రమే దక్కాయి. అలాగే 100 స్థానాలున్న సెనెట్‌లో మెజారిటీకి 51 సీట్లు అవసరం కాగా, డెమోక్రాట్లు 54 స్థానాలు గెలుచుకుని పట్టు సాధించారు. రిపబ్లికన్లు 44 సీట్లకే పరిమితమయ్యారు. ఈ దెబ్బతో భవిష్యత్తులో ట్రంప్ తన కీలక నిర్ణయాలు, బిల్లులు ఆమోదింపజేసుకోవడం చాలా కష్టంగా మారనుంది.
ఈ దారుణ ఓటమికి ఇరాన్ యుద్ధమే (Iran War) ప్రధాన కారణమని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఓ సుదీర్ఘ సోషల్ మీడియా పోస్ట్‌లో బహిరంగంగా విమర్శించారు. రాబోయే ఆరేళ్ల పాటు సెనెట్‌లో మెజారిటీ కోల్పోవడానికి ఇరాన్ యుద్ధమే కారణమంటూ ఆయన వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ట్రంప్ మాత్రం ఎన్నికల ప్రచారంలోనూ, ఫలితాల తర్వాత కూడా ఈ సైనిక చర్యను సమర్థించుకుంటూనే వచ్చారు. అయితే వాన్స్ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్, ఆయన భావోద్వేగాలను అర్థం చేసుకోగలనని, సైనిక చర్య ప్రభావం ఎన్నికలపై పడిందని ఒప్పుకున్నప్పటికీ యుద్ధం సమర్థనీయమేనని స్పష్టం చేశారు.
ఒక లక్షకు పైగా ఓటర్లపై జరిపిన సర్వే ప్రకారం.. దాదాపు 60 శాతం మంది అమెరికన్లు ఇరాన్ పై దాడిని తప్పుపట్టారు. యుద్ధం పట్ల అసంతృప్తిగా ఉన్న ఈ ఓటర్లే ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు పెద్ద ఎత్తున ఓటేశారు. అయినప్పటికీ, సర్వే ప్రకారం కొందరికి ఇది మాత్రమే ప్రధాన అంశం కాదు. దాదాపు సగం మంది ఓటర్లు ద్రవ్యోల్బణం (Inflation), ప్రభుత్వ అవినీతిని కూడా పెద్ద సమస్యలుగా భావించారు. డెమోక్రాట్ మద్దతుదారులు దాదాపు అందరూ ఈ యుద్ధాన్ని తప్పుపట్టగా, రిపబ్లికన్ మద్దతుదారులలో 10 లో 8 మంది మాత్రం ట్రంప్ చర్య సరైనదేనని సమర్థించారు.
మరోవైపు, 2028 అధ్యక్షుడు ఎన్నికల రేసు దృష్టిలో ఉంచుకునే వాన్స్ తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇరాక్ యుద్ధంలో (Iraq War) మెరైన్గా పనిచేసిన వాన్స్, మొదటి నుంచీ విదేశీ సైనిక జోక్యాలను వ్యతిరేకిస్తున్నారు. ఓటమి తర్వాత ఆయన కేవలం యుద్ధాన్ని మాత్రమే కాకుండా ద్రవ్యోల్బణం, ఇజ్రాయెల్ తో సంబంధాలు (Israel Relations), ఇమ్మిగ్రేషన్ పాలసీ (Immigration Policy) మార్పులను కూడా ప్రస్తావించారు. 2028 పోటీపై నిర్ణయం ఎన్నికల తర్వాతే ఉంటతుందని గతంలో చెప్పిన వాన్స్, ఇప్పుడు ట్రంప్ విధానాలకు భిన్నంగా మాట్లాడటం ఆయన రాజకీయ ఆకాంక్షలకు సంకేతంగా కనిపిస్తోంది.
అంతేకాకుండా గవర్నర్ ఎన్నికల్లోనూ డెమోక్రాట్లే ముందంజలో నిలిచారు. మొత్తం 36 రాష్ట్రాల గవర్నర్ పదవులకు ఎన్నికలు జరగ్గా, ఫలితాలు వచ్చిన 34 స్థానాల్లో డెమోక్రాట్లు 22 చోట్ల, రిపబ్లికన్లు 12 చోట్ల విజయం సాధించారు. మిగతా 2 రాష్ట్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది. మొత్తానికి ఈ ఎన్నికలు ట్రంప్ రాజకీయ భవిష్యత్తుకు పెద్ద సవాలుగా మారగా, రిపబ్లికన్ పార్టీ ఈ ఓటమి నుంచి ఏం పాఠాలు నేర్చుకుంటుందో, ట్రంప్-వాన్స్ మధ్య ఈ విభేదాలు ఎటు దారితీస్తాయో వేచి చూడాలి.

