UPSC New Rules: భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం సంసిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ సంవత్సరం నుండి యూపీఎస్సీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 నోటిఫికేషన్ తాజాగా విడుదల అయింది. ఇందులో ఉన్న కొత్త మార్పుల ప్రకారం, ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు తమ వయస్సు, రిజర్వేషన్ కోటా ఆధారంగా సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ మార్పులు గతంలో పూజా ఖేద్కర్ కేసు తర్వాత అమలులోకి వచ్చాయి. గతేడాది, పూజా ఖేద్కర్ అనే వ్యక్తి తప్పుడు ఓబీసీ, మెడికల్ సర్టిఫికెట్ సమర్పించి దివ్యాంగుల కోటాలో ఐఏఎస్‌గా ఎంపికైంది. ఈ కేసు తర్వాత, యూపీఎస్సీ నిబంధనలను మరింత కఠినంగా తీసుకుంది.
Also Read: China: చేజేతులా రెండు కోట్లు వద్దునుకున్న వృద్ధుడు.. ఇప్పుడేమో లబోదిబో అంటున్నాడుగా
2025 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో పుట్టిన తేదీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మాజీ సైనికుల వివరాలు, విద్యార్హతలు, సర్వీస్ ప్రిఫరెన్స్‌లను తప్పనిసరిగా అందించాలి. ఈ పత్రాలను సంబంధిత రుజువులతో పాటు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వీటిని సమర్పించకపోతే, అభ్యర్థి అభ్యర్ధిత్వం రద్దు చేస్తామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. అంతేకాకుండా, 2025 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష మే 25న నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 979 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కూడా వెల్లడించింది. ఈ పోస్టులకు దివ్యాంగులు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వంటి రిజర్వేషన్లు కేటాయించబడ్డాయి.
Also Read: Republic Day Celebrations: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..
ఫిబ్రవరి 11, 2025వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చని కమిషన్ తెలిపింది. ఈ కీలక మార్పులతో, అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన ఇచ్చింది.