UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ

Upi

Upi

UPI Charges: డిజిటల్ పేమెంట్స్ వాడుతున్న కోట్లాది మందికి ఈరోజు, అంటే సెప్టెంబర్ 28 సోమవారం చాలా కీలకమైన రోజు. యూపీఐ (UPI) లావాదేవీలకు సంబంధించిన ఒక ముఖ్యమైన కేసుపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన ఒక నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అసలు విషయమేంటంటే.. రూపాయిలు 2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని యూపీఐ ట్రాన్సాక్షన్లపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ (MDR) విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త నిబంధనను అక్టోబర్ 15 నుంచి అమల్లోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, రూ.2,000 దాటిన ‘పర్సన్-టు-మర్చంట్’ (అంటే మనం దుకాణదారులకు లేదా వ్యాపారులకు చేసే) పేమెంట్లపై 0.4 శాతం చొప్పున MDR విధించడం వెనుక సరైన చట్టపరమైన రక్షణలు గానీ, పారదర్శకత గానీ లేవని, ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకోలేదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందుకే ఈ కొత్త వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇక, MDR అంటే మనం డిజిటల్ పేమెంట్ చేసినప్పుడు ఆ లావాదేవీని ప్రాసెస్ చేసినందుకు గాను కస్టమర్ దగ్గర డబ్బులు స్వీకరించే వ్యాపారి లేదా దుకాణదారుడి నుంచి వసూలు చేసే ఛార్జ్ అన్నమాట. మరి ఈ ఛార్జీ వల్ల సామాన్య కస్టమర్ల జేబులకు చిల్లు పడుతుందా అంటే.. ఏమాత్రం పడదనే చెప్పాలి. ఇది సాధారణ ప్రజలకు పెద్ద ఊరట నిచ్చే అంశం. ఉదాహరణకు, మీరు ఒక షాప్‌లో రూ.5,000 విలువైన వస్తువులు కొని యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే, 0.4 శాతం చొప్పున వచ్చే రూ.20ల MDR ఛార్జ్‌ను మీరు కట్టాల్సిన పనిలేదు. ఆ సొమ్మును సదరు వ్యాపారే చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మరికొన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. మీరు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి ఖాతాకు డబ్బులు పంపే ‘P2P’ ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు ఉండవు, అది ఎంత మొత్తమైనా సరే పూర్తిగా ఉచితం. అలాగే రూ.2,000 వరకు వ్యాపారులకు చేసే చిన్న చిన్న పేమెంట్లపై కూడా ఎలాంటి MDR పడదు. ప్రస్తుతం అమల్లోకి రానున్న ఈ కొత్త డిజిటల్ ఛార్జీల విధానంపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఇప్పుడు అందరూ ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.