Delhi Airport: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు ఫోన్‌లో పేర్కొన్నందుకు 20 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశామని, ఆ కాల్ బూటకమని తేలిందని పోలీసులు గురువారం తెలిపారు. జకీర్ అనే వ్యక్తి సోమవారం బూటకపు బాంబు కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్‌ను డిస్‌కనెక్ట్ చేసే ముందు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టినట్లు ఫోన్ చేసిన వ్యక్తి పోలీసులకు చెప్పాడు. అది చెప్పేసి వెంటనే ఫోన్ కట్ చేశాడు. తాము వెంటనే ఆ నెంబర్‌కు తిరిగి ఫోన్ చేశామని.. అయితే అది స్విచ్ఛాఫ్ చేయబడిందని పోలీసులు వెల్లడించారు.
Read Also: Lightning Strike: పిడుగుల బీభత్సం.. పశ్చిమ బెంగాల్‌లో 14 మంది దుర్మరణం
“ఢిల్లీ విమానాశ్రయంలో వెనువెంటనే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించబడింది, కానీ అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడలేదు” అని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో పోలీసులకు చెప్పిన సమాచారం తప్పని, కాల్ బూటకమని తేలింది. ఆ తర్వాత విచారించి కాల్ చేసిన వ్యక్తి వివరాలను కనుక్కున్నారు. ఆ ఫోన్ చేసిన వ్యక్తి 20 సంవత్సరాల వయసు గల ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ నివాసి అయిన జకీర్ అని పోలీసులు తెలుసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసినట్లు ఓ అధికారి వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.