Site icon NTV Telugu

Unstoppable 2: ‘బాహుబలి’ని ఉక్కిరిబిక్కిరి చేసిన బాలయ్య!

Unstoppable 2

Unstoppable 2

Unstoppable 2: నటసింహ నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘ఆహా’లోని ‘అన్ స్టాపబుల్’ రెండో సీజన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ అతిథిగా పాల్గొనడం విశేషాలకే విశేషంగా మారింది. ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఇప్పటికే రెండు ‘గ్లింప్స్’ వచ్చేసి అభిమానులకు ఆనందం పంచాయి. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ప్రోమో కూడా అలా వచ్చిందో లేదో ఇలా అభిమానులను అలరించేస్తూ ముందుకు సాగుతోంది. ‘బాహుబలి’ మీట్స్ బాలయ్య- అంటూ రూపొందిన ఈ ప్రోమో శనివారం సాయంత్రం విడుదలయింది. ఈ ప్రోమో ఆరంభంలోనే బాలకృష్ణ, ప్రభాస్ ను ఆహ్వానించిన తీరు ఆకట్టుకుంటుంది. “కాశ్యపేయస గోత్రోద్భవస్య ఉప్పలపాటి ప్రభాస్ రాజ్ నామధ్యేయస్య…” అంటూ పిలవడం అక్కడున్నవారినే కాదు, ప్రభాస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు. ప్రభాస్ తనకు ఇష్టమైన వారిని ‘డార్లింగ్…’ అంటూ పిలవడం అందరికీ తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని బాలయ్య ‘సభాముఖంగా అడుగుతున్నా… నన్ను కూడా డార్లింగ్.. అనే పిలవాలి’ అంటూ కోరారు. దానికి ప్రభాస్ ‘అలాగే… డార్లింగ్ సర్…’ అనడంతో వినోదం పండింది.

18 Pages Trailer: అందంగా, ఆసక్తికరంగా ’18 పేజెస్’ చిత్రం ట్రైలర్

‘మొన్నెప్పుడో శర్వానంద్ వచ్చాడు… పెళ్ళెప్పుడూ అంటే ప్రభాస్ తరువాత అని చెప్పాడు…మరి నువ్వు…” అని బాలయ్య ప్రశ్నించగానే, “నేను సల్మాన్ ఖాన్ తరువాత అన్నా…” అని ప్రభాస్ సమాధానం చెప్పగానే నవ్వులు పూశాయి. మధ్యలో గోపీచంద్ రావడం, అతనితో “మనవాడు రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండని ఫోన్ చేయించాడు… అతనేమో చిన్న లీకిచ్చాడు…” అని బాలయ్య చెప్పగానే, “రాణీ గురించే కద్సార్…” అంటూ గోపీచంద్ అనగానే “రేయ్…” అంటూ ప్రభాస్ కేకేయడం అన్నీ సరదాగా సాగాయి. ఇలా సాగిన వినోదం తరువాత రెబల్ స్టార్ కృష్ణంరాజును ప్రభాస్ స్మరించుకోవడంతో ముగిసింది. ప్రోమోలోనే ఇంతగా అలరిస్తూ సాగుతోన్న ప్రభాస్ తో బాలయ్య ఎపిసోడ్ ఏ తీరున మురిపిస్తుందో చూడాలి. డిసెంబర్ 30న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. మరి ఆ ఎపిసోడ్ ఏ తీరున దూసుకుపోతుందో చూడాలి.

https://www.youtube.com/watch?v=wmCOHX1D1gA&feature=youtu.be

 

Exit mobile version