Minister Kishan Reddy: పట్టభద్రుల ఎన్నికలు దెగ్గరపడడంతో ఎన్నికలు జరిగే ఆయా జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టభద్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై ఆయన తీవ్రంగా స్పందించారు. మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆదాయంపై అంచనా లేకుండా నిర్లక్ష్యంగా ఖర్చులు చేసి రాష్ట్రాన్ని తీవ్ర అప్పుల బారిన పడేసిందని విమర్శించారు. రాష్ట్రం ఇప్పటికే 9 లక్షల కోట్ల రూపాయల అప్పుల లో మునిగిపోయిందని, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అంతేకాదు, కాంట్రాక్టర్ల బిల్లులు కూడా చెల్లించని ప్రభుత్వం, రాష్ట్ర ప్రాజెక్టులను పూర్తిచేయలేకపోతుందని ఆయన ఆరోపించారు.
Read Also: Yadagirigutta: ఘనంగా మహా కుంభాభిషేకం.. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరు
రాష్ట్రంలో పరిస్థితి ఇంత దిగజారిపోయిందని, కనీసం వీధిలో లైట్లు కాలిపోతే కొత్త లైట్లు వేయలేని స్థితికి రాష్ట్ర ప్రభుత్వం చేరుకుందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ తన కుటుంబ కేంద్రంగా పాలన సాగించాడని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సోనియా కుటుంబానికి అనుకూలంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ రంగం కుదేలవుతోందని, బిల్డర్ల పని పూర్తిగా నిలిచిపోయిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తూ వాటాలు, ఫ్లోర్లు అడుగుతున్నారని ఆరోపించారు. కొత్త భవనాలకు అనుమతులు ఇవ్వకపోవడంతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం నష్టాల్లో పడిపోయిందని ఆయన చెప్పారు.
ఈ పరిస్థితి చూస్తుంటే.. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి మిగిలేది గాడిది గుడ్డు, ఓటమి మాత్రమే అని ధ్వజమెత్తారు. ప్రజలు కాంగ్రెస్ పాలనను పూర్తిగా తిరస్కరిస్తున్నారని, పార్టీకి భవిష్యత్తు లేదని స్పష్టం చేశారు. సమావేశంలో పలువురు పట్టభద్రులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు పూర్తి మద్దతు ఇవ్వాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.